Breaking News

రోటీ రోలర్, శ్రీకాంతా.. మజాకా!

రోటీ రోలర్, శ్రీకాంతా.. మజాకా!

  • ప్రచారం చేయకుండానే ఓట్లు
  • కారు గుర్తును పోలిన చపాతీ రోలర్
  • 11వ రౌండ్ ముగిసే సరికి 1015 ఓట్లు
  • వార్తల్లోకెక్కిన ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్

సామాజిక సారథి, హుజూరాబాద్: ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ హుజూరాబాద్​ఎన్నికల నేపథ్యంలో హాట్ టాపిక్ గా నిలిచాడు. మూడేళ్లలో ఆరుఎన్నికల్లో పోటీచేసిన ఆయన ప్రచారం చేయకుండానే ఓట్లు సాధిస్తున్నారు. టీఆర్ఎస్ పాలిట ఇబ్బందికర అభ్యర్థిగా మారారు. కారు గుర్తును పోలిన ఏ గుర్తుతోనైతే టీఆర్ఎస్ దుబ్బాకలో ఓడిపోయిందో అదే రోలింగ్ పిన్ గుర్తును సాధించుకున్న ప్రజాఏక్తాపార్టీ అభ్యర్థి శ్రీకాంత్ కు ఓట్లు పడటం ఆసక్తికరంగా మారింది.
మూడేళ్లలో ఆరు ఎన్నికలు
జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్ హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ప్రధానపార్టీ అభ్యర్థులకు తలనొప్పిగా మారారనే చెప్పొచ్చు. గతంలో శ్రీకాంత్ నాలుగుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒకసారి ఎంపీగా పోటీచేసి ప్రచారం చేయకుండానే ఓట్లు రాబట్టుకున్నారు. 2018లో హుజరాబాద్ అసెంబ్లీ స్థానంలో నామినేషన్ వేసినా చివరి నిమిషంలో తప్పుకున్నారు. 2019లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి 6,800 ఓట్లు సాధించారు. 2019లో హుజూర్ నగర్ ఉపఎన్నికలో 584 ఓట్లు, 2020లో దుబ్బాక బైపోల్ లో 594 ఓట్లు, ఇటీవలి నాగార్జునసాగర్ ఉపఎన్నికలో 55 ఓట్లు రాబట్టుకున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ లో ప్రజాఏక్తా అనే పార్టీ నుంచి బరిలోకి దిగిన అతను ఎన్నికల కమిషన్ తో పోరాడి మరీ టీఆర్ఎస్ కారు గుర్తును పోలిన రోలింగ్ పిన్(రొట్టెల పీట, కర్ర) గుర్తును పొందారు.