సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, చివరి ధాన్యం వరకు ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలుచేస్తుందని భరోసా ఇచ్చారు. వర్షాలు పడుతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సివిల్ సప్లై అధికారులు వడ్లను రైస్ మిల్లులకు తరలించడానికి అవసరమైన మేరకు లారీలను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాల నుండి లారీలు తెప్పించాలని, వాటికి కిరాయి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తేమ శాతం, తాలు పేరుతో ఏ రైస్ మిల్లర్ అయిన ధాన్యం కటింగ్ చేస్తే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
- May 24, 2021
- Archive
- Top News
- MLA MARRI
- NAGARKURNOOL
- ఎమ్మెల్యే మర్రి
- డీసీసీబీ
- నాగర్ కర్నూల్
- Comments Off on వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలి