- కోర్టుకు రాఘవ రిమాండ్ రిపోర్ట్
- మొత్తం 12 కేసులున్నాయని వివరణ
సామాజిక సారథి, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి, అక్క లీలా మాధవిలను కొత్తగూడెంలో పాల్వంచ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా వారికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అక్కడి నుంచి పోలీసులు ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులు ప్రధాన నిందితుడు రాఘవను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవను పాల్వంచ పోలీసులు కొత్తగూడెంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా న్యాయమూర్తి రాఘవకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య రాఘవను భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. అనంతరం జైల్లో రాఘవకు రిమాండ్ ఖైదీ నెం.985 సంఖ్యను కేటాయించారు. ప్రత్యేక సబ్‌జైల్లోని బ్యారక్ నెం.1లో అతడిని ఉంచారు. వాస్తవానికి రాఘవను ఖమ్మం జిల్లా జైలుకు తరలించాల్సి ఉండగా శాంతిభద్రతల దృష్ట్యా భద్రాచలం ప్రత్యేక సబ్‌జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. త్వరలో మళ్లీ అతడిని ఖమ్మం జైలుకు తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో తల్లి, సోదరిపైనా రామకృష్ణ సెల్ఫీ వీడియోలో ఆరోపణలు చేశారు.
కోర్టుకు రాఘవ రిమాండ్ రిపోర్ట్
రాఘవపై మొత్తం12 కేసులు ఉన్నాయని, ఆత్మహత్య కేసులో ముందస్తు బెయిల్‌లో ఉన్నాడని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. రాఘవపై కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచ టౌన్, పాల్వంచ రూరల్, లక్ష్మీ దేవిపల్లి పోలీసు స్టేషన్లలో ఉన్న కేసుల వివరాలను పోలీసులు రిపోర్టులో పొందుపర్చారు. పాల్వంచ టౌన్‌లో 5 కేసులు, పాల్వంచ రూరల్‌లో 2, కొత్తగూడెం త్రీ టౌన్ లో 3, లక్ష్మీ దేవిపల్లిలో 1 కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. తాజాగా పాల్వంచ టౌన్‌లో మరో కేసు నమోదు కావడతో, 12 కేసులు నమోదయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.