- నాకు ఆస్తి రాకుండా అడ్డుపడుతున్నాడు
- వీళ్లను ఏం చేస్తారో సమాజానికే వదిలేస్తున్నా
- నాగ రామకృష్ణ మరో వీడియో వైరల్
సామాజికసారథి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలోకుటుబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన నాగ రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన ఆత్మహత్యకు మొదటి సూత్రధారి వనమా రాఘవనే అని వీడియోలో రామకృష్ణ పేర్కొన్నారు. తన తల్లి, సోదరి అతనికి సహకరించి.. తనకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తివాటాను రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, తన సోదరి కొమ్మిశెట్టి మాధవితో రాఘవకు 20 ఏళ్లుగా వివాహే సంబంధం ఉందని పేర్కొన్నాడు. ఆ సంబంధం వల్లే ఒక కుటుంబం నాశనమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. తానేమీ అనవసర అభియోగాలు, ఆరోపణలు చేయడం లేదన్నారు.
వీడియోలోని రామకృష్ణ మాటలు
‘నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావడానికి మొదటి పాత్రధారి, సూత్రధారి వనమా రాఘవేంద్ర. మా అక్క కొమ్మిశెట్టి మాధవితో రాఘవకు 20 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉంది. దీనికి మధ్యవర్తిగా మా అమ్మ గారి సహకారం. ఈ ముగ్గురు కలిసి తండ్రి ద్వారా న్యాయబద్దంగా రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఏడాది క్రితం పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని ఆస్తి పంపకాలకు కాగితాలు రాసుకున్నాం. కానీ ఏడాది నుంచి దాన్ని పెండింగ్‌లో పెట్టి నన్ను అప్పుల ఊబిలోకి నెట్టారు. నాకు చావు తప్ప వేరే మార్గం లేని పరిస్థితికి తీసుకొచ్చారు. అక్రమ సంబంధం వల్ల ఒక కుటుంబం, వంశం నాశనమయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు. వీళ్లను ఏం చేస్తారో సమాజానికే వదిలేస్తున్నాను..’ అని సెల్ఫీ వీడియోలో నాగ రామకృష్ణ పేర్కొన్నాడు. ‘ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండే రాఘవకు మా ఫ్యామిలీ విషయాల్లో ఎందుకంత ఇంట్రస్ట్. మా అక్క బాధపడుతుందన్న ఆలోచనతో ప్రతి విషయంలో కలగజేసుకునేవాడు’ అని నాగ రామకృష్ణ వెల్లడించాడు.
రుణదాతలకు అన్యాయం చేయొద్దు
తమ స్వగ్రామం పోలవరం మండలంలోని పట్టిసీమ అని… హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన తన తండ్రిని 1992లో నక్సలైట్లు చంపేశారని పేర్కొన్నారు. తన సోదరికి పోలవరంలో రెండెకరాలు, రాజమండ్రిలో రెండు ఇళ్లస్థలాలు, గోకవరంలో ఇంటి స్థలం, తల్లి రిటైర్మెంట్డబ్బులో వాటా ఇచ్చామన్నారు. ప్రస్తుతం తన తల్లి కూడా సోదరితోనే ఉంటుందని, తాను, తన కుటుంబం అద్దె ఇంటిలో ఉంటున్నామని తెలిపారు. ఇప్పటివరకూ రూ.30 లక్షలు అప్పులు అయ్యాయని, తనకు అప్పులు ఇచ్చిన వారికి అన్యాయం చేయొద్దని కోరాడు.