Breaking News

పోలింగ్ సమర్థవంతంగా నిర్వర్తించాలి

పోలింగ్ సమర్థవంతంగా నిర్వర్తించాలి
  • నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
  • నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికలో పోలింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ పోలింగ్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వచ్చిన పోలింగ్ అధికారులను  ఉద్దేశించి అదనపు  కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనల ప్రకారం,  పోలింగ్ అధికారులు పొందిన శిక్షణ ప్రకారం ఎన్నికలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈనెల 10వ తేదీన ఉదయం 8గంటల నుంచి 4గంటల వరకూ జరిగే పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని మైక్రో అబ్జర్వర్ లకు సూచించారు. పోలింగ్  ప్రారంభానికి ముందు పోటీచేస్తున్న అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి చూపించాకే సీల్ చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి అధికారులు, ఓటర్లు సెల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.  డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ అధికారులు  బస్సులో నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని, మధ్యలో ఎక్కడా కూడా ఆగవద్దని అన్నారు.  నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, దేవరకొండ ఆర్డీవో గోపిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.