Breaking News

‘ఛీ…’ కొట్టినా వస్తున్నారు!

‘ఛీ...’ కొట్టినా వస్తున్నారు!
  • దొంగచాటుగా వచ్చి ముఖ్యనేతలతో ఫొటోలు
  • బీఆర్​ఎస్​ మైండ్​ గేమ్​ పై జాగ్రత్తగా ఉండాలని..
  • కాంగ్రెస్​ సీనియర్​ నేతల కీలక సూచనలు
  • ‘నాడు వేధించారు.. నేడు పంచన చేరారు’
  • ‘సామాజికసారథి’ కథనంపై హాట్​ డిస్కషన్​

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: రాష్ట్రంలో బీఆర్​ఎస్​ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. అయితే కేసీఆర్​ పరిపాలన కాలంలో రాజకీయంగా పడిన ఇబ్బందులను ఇప్పటికీ నాటి విపక్షమైన కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు గుర్తుచేసుకుంటుంటారు. కేసులు, ఇతరత్రా విషయాల్లో ఇబ్బందులు గురిచేసేవారని చెబుతుంటారు. అధికారమార్పిడి జరగడంతో కొందరు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇదిలాఉండగా, నాగర్​ కర్నూల్​ నియోజకవర్గంలో గత బీఆర్​ఎస్​ హయాంలో రాజకీయంగా జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరిస్తూ ఈనెల 10న ‘సామాజికసారథి’లో ప్రచురించిన ‘నాడు వేధించారు.. నేడు పంచన చేరారు’ కథనం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇది వందశాతం నిజమేనని చర్చించుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ప్రభుత్వం రాగానే పార్టీలు మారేవారు చాలా మందే ఉన్నారని చెబుతున్నారు. గ్రామాల్లో ఇలాంటి దొంగచాటు ఫొటోలు దిగే మైండ్ గేమ్ ఆడే బీఆర్ఎస్ నేతలు చాలామంది ఉన్నారని వారిని కాంగ్రెస్ కార్యకర్తలే గుర్తించి ఎప్పటికప్పుడు నిలదీయాలని ఒకరికొకరు చెప్పుకున్నారు. కష్టపడి పనిచేసి గెలిపించుకున్న నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్​ రెడ్డిని ఇలాంటి దొంగ చాటు గేమ్ గాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. బీఆర్ఎస్ లో ఛీకొట్టి అక్కడి నుండి గెంటేస్తే ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి దగ్గరై స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త అవతారం ఎత్తి కొత్త దందాలు చేద్దామని ఆశపడుతున్నవారు ఉన్నారు. అలాంటి వారి మైండ్ గేమ్ ఆడేవారితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సీనియర్​ నేతలు సూచిస్తున్నారు.