దేశంలోనే తొలి లైన్‌ఉమెన్‌గా భారతి, శిరీష ఎంపిక
రిటన్ టెస్ట్, పోల్ టెస్ట్‌లోనూ పాస్..
గవర్నర్తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక అభినందనలు
పుట్టి పెరిగింది మారుమూల పల్లెటూరులోని పేదింటి కుటుంబం. అవకాశాలు అంతంత మాత్రమే. కష్టపడితే అసాధ్యమేది కాదని నిరూపించారు ఆ ఇద్దరు యువతులు. అవరోధాలను అధిగమించి తమ కలల కొలువును సాధించారు. అంతే కాదోండయ్.. దేశంలోనే ప్రప్రథమంగా విద్యుత్‌శాఖలో లైన్ ఉమెన్‌గా ఉద్యోగం సంపాదించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఆ మహిళా మణులు ఎవరో కాదు.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దేశ్యాతండాకు చెందిన 32 ఏళ్ల వాంకుడోతు భారతి, సిద్దిపేట జిల్లా మర్కూక్మండలం గణేష్‌పల్లి గ్రామానికి చెందిన 20ఏళ్ల బబ్బూరి శిరీష.
పేదంటి మాణిక్యాలు
– వాంకుడోతు భారతి మారుమూల దేశ్యాతండాలోని కూలీ కుటుంబంలో పుట్టి పెరిగింది. వ్యవసాయ కూలీ పనులే ఆమెకు జీవనాధారం. ఇంటర్మీడియట్ దేరుట్ల కాలేజీ, భద్రాచలం గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఎంకామ్ చదివింది. ప్రస్తుతం ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి. ఓ వైపు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ.. మరో వైపు కూలీ పనులు చేస్తూ.. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్అయింది. భర్త సహకారంతో ఐటీఐ కోర్సు కూడా పూర్తిచేసింది. తండాలో పుట్టి పెరిగిన నేపథ్యం కావొచ్చు బహుశా.. చెట్లు, స్తంభాలు ఎక్కడం నేర్చుకుంది. ఇలా తన భర్త సహాయంతో వరంగల్‌లోని ఎన్పీడీసీఎల్ గ్రౌండ్లో నెల రోజుల పాటు పోల్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేసింది.
–సిద్దిపేట జిల్లా గణేష్‌పల్లి గ్రామానికి చెందిన బబ్బూరి శిరీష అమ్మానాన్నలకు ఒకే కూతురు. తల్లిదండ్రులు కూడా ఆమె చిన్నతనంలోనే మేడ్చల్‌కు పొట్టచేతబట్టుకుని వలసవెళ్లారు. స్థానిక కంపెనీల్లో కూలీలుగా పనులు చేస్తూ కూతురును చదివించారు. తన తల్లిదండ్రుల కష్టాలను చూసి పెరిగిన శిరీష ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సంకల్పించింది. అందుకోసమే ఐటీఐ చేసింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ లైన్‌మెన్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. తన మేనమామ శేఖర్‌గౌడ్ సాయంతో ఇంట్లోనే తాడుకట్టి ప్రాక్టీస్ చేయడం నేర్చుకుంది. ఆ తర్వాత ప్రజ్ఞాపూర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ స్తంభం ఎక్కడం ప్రాక్టీస్ చేసింది. రాత పరీక్ష పాసైన తర్వాత డిసెంబర్ 23న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ సెంట్రల్ పవర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో పోల్ క్లైంబింగ్ టెస్టులోనూ పాసైంది.
ఒక్క నిమిషంలో పోల్ ఎక్కి.. దిగాలి
సాధారణంగా లైన్‌మెన్ పోస్టుల్లో ఎక్కువగా పురుషులకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తుంటారు.. ఈ కారణంతోనే కావొచ్చు మహిళా అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ వాంకుడోతు భారతి, బబ్బూరి శిరీష తామెందుకు లైన్‌మెన్ కాకూడదని కసి, పట్టుదలతో సాధన చేశారు. ఈ క్రమంలో 2019 సెప్టెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 534 లైన్‌మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువరించింది. అయితే మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ లేదు. అన్ని రంగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉన్నాయంటారు కదా.. మరి లైన్మెన్కు ఎందుకు లేదని కోర్టుకు వెళ్లారు. కోర్టుకు పర్మిషన్ ఇవ్వడంతో రిటన్ టెస్ట్‌లో పాసయ్యారు. ఇంతలో పోల్ టెస్టుకు మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి. వారు మళ్లీ కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మేరకు పోల్ టెస్టు నిర్వహించగా, అందులోనూ పాస్ అయ్యారు. ఒక నిమిషంలో పోల్ ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఆ పని చకచకా చేసేశారు. ఇంకేముందు ఎన్పీడీసీఎల్ అధికారులు వారిని అభినందించి జాబ్లెటర్ను చేతిలో ఉద్యోగం పెట్టారు. విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం ట్విట్టర్‌లో ‘శభాష్ శిరీష’ అంటూ తన శ్రమ, పట్టుదలకు గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. ‘చాలా సంతోషంగా ఉంది. దేశంలో మొదటి లైన్ ఉమెన్‌గా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించడం మరువలేను’ అని జబ్బురి శిరీష పేర్కొంది.
రెట్టించిన ఆత్మవిశ్వాసం.. అంతకుమించి కొండంత ధైర్యం.. సవాళ్లను అధిగమించి క్లిష్టమైన సర్కారు కొలువు కొట్టిన వాంకుడోతు భారతి, బబ్బూరి శిరీషను ప్రతిఒక్కరూ తప్పకుండా అభినందించాల్సిందే.. యువతులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే..!
::: సతీశ్.జి