- లంకలో అంతా రాక్షసులే ఉంటారని నిరూపించిన ఏపీ సీఎం జగన్
- నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ధ్వజం
సారథి ప్రతినిధి, నాగర్‌కర్నూల్: లంకలో అంతా రాక్షసులే ఉంటారని ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి నిరూపించారని నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పాలిట గాడ్సేగా మారాడని విమర్శించారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిలా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగం ఉసురు తగిలితే జగన్ ఇంటికి పోవడం ఖాయమన్నారు. శనివారం ఆయన నాగర్‌కర్నూల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సమైక్యపాలనలో 11వేల క్యూసెక్కులకు గానూ నాటి సీఎం వైఎస్సార్ 44వేల క్యూసెక్కుల నీటిని అనధికారికంగా తీసుకెళ్లారని గుర్తుచేశారు. దీన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ఎమ్మెల్యేలు నాడే రాజీనామా చేశారని వివరించారు. రోజుకు నాలుగు టీఎంసీల నీటిని దోపిడీ చేశారని, నాడు డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య స్వాగతం పలికారని విమర్శించారు. ఇప్పుడు వారికి మాట్లాడే నైతికహక్కు ఉందా? అని ప్రశ్నించారు. కొందరు సీఎం కేసీఆర్‌ను తిడితే గొప్పవాళ్లు అవుతారని అనుకుంటున్నారని, అది కుదరదన్నారు. 70 టీఎంసీల నీటిని వాడుకునేలా చేపట్టిన జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి 20 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాల్సి వస్తోందని వివరించారు. టీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో ఆరేళ్లలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. బండి సంజయ్ మాట్లాడేది అర్థరహితమన్నారు. ప్రధాని వద్దకు బీజేపీ అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు.