Breaking News

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు

  • పెండింగ్ అప్లికేషన్లను పరిశీలించండి
  • అద్దె ఇళ్లల్లో ఉన్నవారికీ కార్డులు
  • ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల భర్తీ
  • తండాలు పంచాయతీగా మారిన చోట సబ్ డీలర్
  • పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

సారథి ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్రంలో అర్హులైన అందరికీ పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులను జారీచేయాలని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సూచించిన విధంగా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి జాబితాను వారం రోజుల్లో పంపించాలని సూచించారు. నూతన రేషన్ కార్డుల జారీ, ధాన్యం కొనుగోళ్లు సంబంధిత అంశాలపై ఆయన శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొంతమంది అద్దె ఇళ్లల్లో ఉన్నవారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం వారు మారిన ఇళ్లను గుర్తించి ఉన్న చోటే కార్డు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో రేషన్ కార్డులకు త్వరలోనే స్మార్ట్ కార్డులను జారీచేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో 1,454 చౌక ధరల దుకాణ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలోనే భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రాష్ట్రంలో కొన్నితండాలు పంచాయతీలుగా మారాయని, ప్రజల అవసరాన్ని బట్టి వారికి సబ్ సెంటర్ డీలర్ ను నియమిస్తామన్నారు. అన్ని జిల్లాల నుంచి అర్హులైన రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా అందిన వెంటనే సీఎం కేసీఆర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అవసరమైన చోట నూతన రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్

ధాన్యం కొనుగోళ్లలో భేష్
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు. రబీ సీజన్ లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం కాగా, ఇంతవరకు అంచనాలకు మించి రూ.17వేల కోట్లకుపైగా విలువైన 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యానికి డబ్బులను మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో జమచేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో వరిసాగు ఆలస్యమైందని, ఆ ధాన్యాన్ని కూడా కొంటామన్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి ఘణనీయంగా పెరిగిందన్నారు. అందుకే రాష్ట్రప్రభుత్వం నూతనంగా తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది తెలిపారు. కరోనా క్లిష్ట సమయంలోనూ కూలీల ఇబ్బంది, మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్ కొరత వంటి ఇబ్బందులను అధిగమించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణలో సహకరించిన జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, పౌర సరఫరాలశాఖ, రెవెన్యూ సిబ్బంది, సహకార సొసైటీలు, మహిళా సంఘాలు, కూలీలు, హమాలీలకు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వానాకాలం సీఎంఆర్ రైస్ డెలీవరి త్వరగా అయ్యేలా చూడాలని పౌరసరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. జగిత్యాల జిల్లా నుంచి కలెక్టర్ జి.రవి, జిల్లా పౌరసరఫరాల అధికారి, సివిల్ సప్లయీస్ డీఎం తదితరులు పాల్గొన్నారు.