Breaking News

మోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుండ్రు

కార్పొరేట్ లకు కొమ్ము కాస్తున్న మోడీ ప్రభుత్వం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

సామాజిక సారథి,వరంగల్: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని ద్వంసం చేస్తూ కార్పొరేట్ లకు కొమ్ము కాస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా సీపీఐ రాజకీయ శిక్షణా తరగతులు బీమదేవరపల్లి మండలం కొత్త కొండ గ్రామంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక హరిత హోటల్ ఎదుట సీపీఐ పతాకాన్ని చాడ వెంకట్ రెడ్డి ఎగుర వేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి అధ్యక్షతన జరిగిన శిక్షణా తరగతుల ప్రారంభ సమావేశంలో చాడ మాట్లాడుతూ భారతదేశం వివిధ కులాల, మతాల, భిన్న సంస్కృతుల సమ్మేళనం అని,అలాంటి దేశంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్, నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నదని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై ఈ నెల 7న అఖిల పక్షం ఆద్వర్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 9న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, పార్టీ జిల్లాల కార్యదర్శులు సిహెచ్ రాజారెడ్డి, బి. విజయ సారథి, కె. రాజ్ కుమార్, పంజాల రమేష్, తోట మల్లికార్జున రావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కర్రె బిక్షపతి, నాయకులు టి. విశ్వేశ్వర్ రావు, ఆదరి శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు పార్టీ కార్యక్రమంపై కూనంనేని సాంబశివరావు, మార్క్సిజం-సమకాలీన సమాజంలో దాని ప్రాధాన్యత అన్న అంశంపై ఎన్. మధుకర్, మతం, మతోన్మాదం,  ఆర్ఎస్ఎస్ ఎజెండాపై డాక్టర్ ఎం. శంకర్ నారాయణ బోధించారు.