సామాజిక సారథి, ఏన్కూరు: రైతులు సాగు చేసిన మిరప తోటలపై తామర పురుగు తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంది. దీంతో పంట దెబ్బతిని రైతులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో మిరప సాగు చేశారు. ఆశించిన ధర ఉండటంతో చాలా మంది రైతులు మిరప సాగుపై ఎక్కువ ఆసక్తి కనపర్చారు. మండలంలో గత ఏడాది కేవలం ఐదువేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా ఈ ఏడాది సుమారు రూ.14వేల ఎకరాల్లో సాగు చేశారు. పత్తి సాగు విస్తీర్ణం తగ్గించి మిరప సాగుపై దృష్టి పెట్టారు. ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడులు పెట్టారు. తీరా రకరకాల తెగుళ్లు, చీడపీడలు సోకాయి. తొలుత జెమినీ వైరస్, కాయకుళ్లు తెగుళ్లు సోకటంతో రైతులు చాలాచోట్ల మిరప తోటలను తొలగించారు. తామర పురుగు నియంత్రణకు పురుగుమందులు వాడినప్పటికీ ఫలితం కన్పించటం లేదు. చాలాచోట్ల తామర పురుగు ఆశించటంతో రైతులు చేసేదేమీ లేక మిరప తోటలను తొలగిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, విత్తన లోపం, నర్సరీల్లో మాయాజాలం తదితర కారణాలతో మిరప తోటలు దెబ్బతిన్నట్లు రైతులు వాపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయామని ప్రభుత్వం మిరప రైతులను ఆదుకోవాలని రైతులతోపాటు రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.