మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, బాబీ కొల్లిల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ఇందులో మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం కోసం టీం అందరితో కలసి సమిష్టి కృషి చేస్తూ బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుందనే నమ్మకంతో పనిచేశాం. ప్రేక్షకుల స్పందననే మా ఇంధనం. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు, అభినందనలు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. వారితో మళ్ళీ కలసి పని చేయాలని వుంది. దర్శకుడు బాబీ ఈ కథని అద్భుతంగా మలిచారు. రవితేజ లేకపోతే ఆ ఎమోషన్ వచ్చేది కాదు. ప్రేక్షకులు చెబుతున్న థాంక్స్ కి తిరిగి థాంక్స్ చెబుతున్నాం.’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ.. ‘‘ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాను. సక్సెస్ మీట్ లో కలుద్దామని అన్నాను. ఆ నమ్మకం ఈ రోజు నిజమైయింది. చాలా ఆనందంగా వుంది. అన్నయ్య తో ఇంతకుముందు రెండు సినిమాలు చేశాను. కానీ ఈ సందడి వేరు. సినిమా చూసి వచ్చిన చిన్న పిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు. అంత గొప్పగా కనెక్ట్ అయ్యింది. అన్నయ్యతో ఫుల్ లెంత్ ఎంటర్ టైనర్ చేయాలని వుంది. అది బాబీనే చూడాలి’’ అన్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసిన ప్రేక్షకులు ‘’మా చిరంజీవిని మాకు ఇచ్చావ్ అన్నా’’ అన్నారు. ఒక అభిమాని అయిన దర్శకుడుకి ఇంతకంటే గొప్ప సక్సెస్ ఏం కావాలి. చాలా గర్వంగా అనిపించింది. ఈ సినిమా ఇంతగొప్పగా నిర్మించిన మా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. శ్రుతి హాసన్, కేథరిన్, ప్రకాష్ రాజ్ గారు అందరూ అద్భుతంగా చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పూనకాలు లోడింగ్ లాంటి యాక్షన్ ఇచ్చారు. నా డైరెక్షన్ టీం అందరికీ కృతజ్ఞతలు”తెలిపారు, నవీన్ యెర్నేని మాట్లాడుతూ… ‘‘ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాం. ఎంతపెద్ద బ్లాక్ బస్టర్ అంటే చిరంజీవి గారి కెరీర్ బెస్ట్ మూవీ ని చాలా పెద్ద మార్జిన్ తో కొట్టబోతుందీ మూవీ. చాలా ఆనందంగా వుంది. ఈ రోజు ఉదయం కలెక్షన్స్, షోలు చూసిన తర్వాత.. ఇది ఖచ్చితంగా ఆల్ టైం బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం వుంది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా మాకు ఇచ్చిన చిరంజీవి గారికి, రవితేజ గారికి, బాబీ గారికి కృతజ్ఞతలు. నైజాంలో 6.10 సీఆర్, ఉత్తరాంధ్రలో 2.50 సీఆర్, ఈస్ట్ 2.70, యూఎస్ లో ప్రీమియర్ ఫస్ట్ డే కలిపి 1 మిలియన్ కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ సునామీ ఇప్పుడప్పుడే ఆగదు. మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా రెండు సినిమాలు ఒకేసారి విడుదలై, రెండూ బ్లాక్ బస్టర్స్ విజయాలు సాధించడం చాలా రేర్ ఫీట్’’ అన్నారు.
సినిమా డెస్క్ ,ఉషా, ఫ్రీలాన్సర్