- లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు
- పెద్దపల్లిలో ఆర్డీవో, నాగార్ కర్నూల్ జిల్లాలో కార్యదర్శి
సామాజిక సారథి, పెద్దపల్లి/అచ్చంపేట: అవినీతి నిరోధించడానికి ప్రభుత్వం ఎన్ని పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా.. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. తమకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించాల్సింది పోయి.. తమలోని అవినీతి జలగను మేలుకొలుపుతూ.. ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. రూ.లక్షలు, వేలల్లో జీతాలు తీసుకుంటున్నా కక్కుర్తికిపోయి.. ఉద్యోగాలే పొగొట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్గా పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ అదనపు విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఓ క్రాంట్రాక్టర్ తాను చేసిన పనులకు గాను బిల్లులు చెల్లించాల్సిందిగా ఆర్డీవో శంకర్ నాయక్ ను కోరాడు. బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ రజనీకాంత్ ను ఆర్డీవో శంకర్ నాయక్ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. బిల్లుల్లో పర్సంటేజ్ ఇస్తేనే సంతకం పెడుతానని ఆర్డీవో తెగేసి చెప్పాడు. విసుగుచెందిన కాంట్రాక్టర్ దీంతో రజనీకాంత్ ఏసీబీని అధికారులకు విషయం తెలిపాడు. దీంతో వారి సూచనమేరకు రూ.1లక్షను తన బంధువు ద్వారా ఆర్డీవోకు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు ఉన్నపలంగా పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మ్యూటేషన్ చేయాలంటే రూ.6వేలు..
నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంటి మ్యూటేషన్ కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన చింతకుంట్ల రామస్వామి వంగూరు మండలం రంగాపూర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన సంకెళ్ల రాము తన తల్లి పేరునా ఉన్న ఇల్లును తనపై మ్యూటేషన్ చేయాలని పంచాయతీ జూనియర్ కార్యదర్శిని కోరారు. ఆయన దానికి రూ.6 వేలు లంచంగా ఇస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పాడు. దీంతో గత్యంతరం లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం రూ. 5,500 లను పంచాయతీ కార్యదర్శికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడి నుంచి నగదును స్వాధీనం చేసుకుని రామస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.