Breaking News

కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

సారథి, రామాయంపేట: కొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది. సంతోషాల మధ్య శుభకార్యం జరగాల్సిన ఆ ఇంటిలో చావు డప్పు మోగింది. పుస్తెమట్టెలను తీసుకొచ్చేందుకు వెళ్లిన పెళ్లికొడుకు తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని 44వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం.. పులిమామిడి గ్రామానికి చెందిన మందపురం రాజయ్య(55) చిన్నకుమారుడు గణేష్ వివాహం నగరం గ్రామంలో జరగాల్సి ఉంది. పులిమామిడి నుంచి రామాయంపేటకు వచ్చి పుస్తెమట్టెలు తీసుకుని తిరిగి వస్తున్నాడు. రామేశ్వరంపల్లి గ్రామానికి వెళ్లే మార్గమధ్యంలో దామరచెరువు బైపాస్ వద్ద హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ, బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రాజయ్య అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటివరకు ఆనందోత్సాహాల మధ్య ఉన్న పెళ్లికూతురు, పెళ్లికొడుకు కుటుంబీకులు, బంధువులు విషయం తెలుసుకుని ఒక్కసారిగా హతాశులయ్యారు. అజాగ్రత్తగా లారీ నడిపిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని మృతుడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.