Breaking News

10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక

10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక

  • మహబూబాబాద్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం
  • ఆరుగురి దుర్మరణం‌‌.. పెళ్లింట విషాదఛాయలు
  • సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి.. మంత్రుల విచారం

సారథి న్యూస్, మహబూబాబాద్: మరో పది రోజుల్లో కూతురు పెళ్లి.. కొత్త వస్త్రాలు కొనేందుకు వెళ్లిన ఆ కుటుంబం ఇంటికి తిరిగిరాలేదు. శుభలేఖలతో బంధువుల వద్దకు వెళ్లాల్సిన పెళ్లింటి వారు విగతజీవులుగా మారారు. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆరుగురిని బలితీసుకుంది. పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంగా మారింది. మహబూబాబాద్​ జిల్లా గూడురు మండలం ఎర్రకుంటతండాకు చెందిన జాటోత్‌ కళ్యాణి, కస్నా ఫిబ్రవరి 10న తన కుమార్తె పెళ్లి చేసేందుకు ముహూర్తం నిశ్చయించారు. శుభలేఖలు, పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన కుటుంబం నూతన వస్త్రాలు కొనేందుకు ఆటోలో వరంగల్లు నగరానికి బయలుదేరి వెళ్లింది. వధువు(19)తో పాటు ఆమె తల్లి కళ్యాణి(45), బాబాయి ప్రసాద్(38), అన్న ప్రతీక్(20), చెల్లెలు దివ్య(17), ఆటోడ్రైవర్‌ రాము(25)తో కలిసి వరంగల్లుకు వెళ్లారు. ఈ క్రమంలో గూడురు మండలం మర్రిమిట్ట శివారులోకి రాగానే వీరంతా ప్రయాణిస్తున్న ఆటోను వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ప్రొక్లెయినర్ సాయంతో వెలికితీత
ప్రమాదం జరిగిన తీరు అక్కడికి చేరుకున్న స్థానికులను తీవ్రంగా కలచివేసింది. గ్రామస్తుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆటోలో ఇరుక్కుపోయిన ఆరుగురు మృతదేహాలను ప్రొక్లెయినర్ సాయంతో బయటికి తీశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..
ప్రమాదం విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రులు సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.