Breaking News

తప్పు చేయలేదు.. తలొంచను

తప్పుచేయలేదు.. తలొంచను

  • నేను నిప్పు లాంటోడిని..
  • చిల్లరమల్లర వాటికి లొంగను
  • ఆ మీడియాలో తప్పుడు కథనాలు
  • ప్రజల్లో పలుచన చేసే కుట్ర
  • నాపై ఆరోపణలకు ఏ విచారణకైనా సిద్ధమే
  • అంతిమ విజయం ధర్మానిదేనని స్పష్టం
  • మీడియా సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్​

సారథి, హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలను తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఖండించారు. విచారణకు దేనికైనా సిద్ధమేనని సవాల్ ​విసిరారు. అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ప్రకటించారు. చిల్లర మల్లర ఆరోపణలకు లొంగిపోనని, తాను ముదిరాజ్ ​బిడ్డనని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవికి గడ్డిపోచ కింద లెక్క అని, తన ఆత్మగౌరవం కన్నా పదవి ముఖ్యం కాదని పేర్కొన్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్‌ వివరణ ఇచ్చేందుకు శుక్రవారం రాత్రి హైదరాబాద్ ​శివారులోని శామీర్ పేటలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. 20 ఏళ్లుగా హుజురాబాద్​ నుంచి గెలుస్తున్నానని తన నియోజకవర్గంలోకి వెళ్లి అడిగితే తన గురించి ఎవరైనా చెబుతారని అన్నారు. ఏమీ లేనప్పుడు కూడా తాను కొట్లాడానని, ధర్మం కోసం.. ప్రజల కోసం కొట్లాడుతానని స్పష్టం చేశారు. అంతిమ విజయం ధర్మానిదేనని అన్నారు. తనపై కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన కట్టుకథలేనని, ప్రణాళికా ప్రచారం చేసినవేనని ఖండించారు.

తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు కొన్నం
‘1986లో హ్యాచరీలోకి నేను మా మేడం జుమున కలిసిపెట్టాం. వరంగల్‌లో 1992లోనే హ్యాచరీస్​ ను అభివృద్ధి చేశాం. యాంజల్‌లో 2004 వరకు 170-180 ఎకరాలతో ఎదిగిన. బంజారాహిల్స్‌లో సీఎం కేసీఆర్‌ చెప్పడంతోనే 2007లో రూ.ఐదుకోట్లతో 2,100 గజాల భూమి కొన్నా. దానిపై ఇంకా కిరికిరి నడుస్తుంది. ఇంకా ఇల్లు కట్టుకోలేదు. ఆత్మను అమ్ముకోను. మాకు ఇన్నాళ్లూ బతుకుదెరువు ఇచ్చిన పౌల్ట్రీని ఎక్స్​పాన్స్​ చేద్దామని నా కొడుకు చదువు అయిపోయి పూణే నుంచి వచ్చిన తర్వాత అనుకున్నాం. ఎక్కడో దూరంగా అత్యంత వెనకబడిన అచ్చంపల్లిలో తొండలు కూడా గడ్లు పెట్టని భూములను ఎకరాకు రూ.6 లక్షల చొప్పున 40, 50 ఎకరాలు కొన్నాం. కెనరా బ్యాంక్‌ ద్వారా రూ.వంద కోట్ల రుణం తీసుకుని హ్యాచరీని అభివృద్ధి చేశాం. విస్తరించడం కోసం భూములు కొన్నాం. రూపాయి అక్కరకు రాని భూములు తీసుకున్నాం. ఈ విషయం సీఎం కేసీఆర్‌కు కూడా చెప్పాం. భూకబ్జా ఆరోపణలు అత్యంత నీచమైనది. ఇంత కథలు చెప్పి.. ఇంత దుర్మార్గమైన విషయాలు తగదు..’ అని మంత్రి ఈటల రాజేందర్​ ఖండించారు.

నా చరిత్ర చెరగనిది
తన చరిత్ర ఏందో చెరిపేస్తే చెరగనిదని, తాను ముదిరాజ్ ​బిడ్డనని, తన భార్యది రెడ్డి కులమని మంత్రి ఈటల రాజేందర్​ చెప్పుకొచ్చారు. తన కులంపై కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనం కులం ఎవరికీ భయపడదని స్పష్టంచేశారు. తనపై ఏవైనా ఆరోపణలు ఉంటే సిట్టింగ్‌ జడ్జి, సీబీఐ.. ఎన్ని సంస్థలు ఉన్నాయో వాటితో విచారణ చేయండని కోరారు. ఈటల అంటే నిప్పు అని చెప్పారు. తనపై ఆరోపణలు వస్తుంటే ఏడుస్తున్నారని, గుండెలకు గాయాలు అవుతున్నాయని నాకు ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. తాను నయీం లాంటోడి బెదిరింపులకే బెదరలేదన్నారు. అందరి చరిత్ర తనకు తెలుసునని స్పష్టం చేశారు. దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని, స్కూటర్‌పై వచ్చిన వందల కోట్లు సంపాదించిందెవరు? అలాంటి వారిపై విచారణ జరిపించాలని సవాల్​ విసిరారు. మాట్లాడుతున్న సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్​ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సెక్యూరిటీ చేతిలో ఉన్న బాటిల్​ తీసుకుని నీళ్లు తాగుతూ కనిపించారు.