- ఉద్యోగులతో చర్చించాకే నిర్ణయించాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
సామాజికసారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అనాలోచిత.. అర్ధరాత్రి నిర్ణయాలతో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోనం.317ను నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యపై సీఎం స్పందించకుంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో తాము ఎలాంటి రాజకీయం చేయడం లేదని, స్థానికత, సీనియారిటీ ఆధారంగానే బదిలీలు చేయమని కోరుతున్నామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 36 నెలల్లోగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలుచేయాల్సి ఉన్నా సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు చర్చించకుండా, ఉద్యోగులు, టీచర్ల అభిప్రాయాలు తీసుకోకుండా వారితో పాటు వారి కుటుంబసభ్యులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. బదిలీలపై శాస్త్రీయ అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో సీఎం స్పందించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్థానికత ఆధారంగా 90శాతం ఉండాలని చెప్పారు కానీ ఎలా చేశారో ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదన్నారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగస్తుల ఇబ్బందులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్యోగస్తుల సమస్యలపై స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తే బీజేపీ వారి పక్షాన ఆందోళనలు చేపడుతుందన్నారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు విషయంలో ఒప్పందం కుదర్చుకుని, బలవంతంగా ఒప్పించారని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు ఎందుకు ఆందోళన చేశారో వారికే తెలియదన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే రోజు వస్తుందని బండి సంజయ్ విమర్శించారు.