సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: నాగం జనార్దన్ రెడ్డిని మంత్రిగా చేద్దాం అంటూ.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం విశ్వబ్రాహ్మణుల సమావేశాని హాజరైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..నాగంను పొగడ్తల్లో ముంచెత్తారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ నాగంతో పాటుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డి ఆశిస్తున్నారు. ఈ క్రమంలో నాగం తనకే టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే నాగంకు ప్రజల్లో, స్థానిక కాంగ్రెస్‌లో ఆశించినంత ఆదరణ లభించడం లేదు. అయితే నాగంకు టికెట్ వస్తే గెలుపు ఈజీ అవుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు, రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తనకు ఎదురుగా వచ్చిన నాగంతో ఆయన అనుచరులను ఉద్దేశిస్తూ ‘టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించండి పెద్దమనిషిని మంత్రిని చేద్దాం..’ అంటూ అభిమానులకు సూచించారు. ఆయన వ్యాఖ్యలు అక్కడున్నవారిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి.
మర్రి ఏమన్నారంటే..!
నాగం అనుచరుడు ఐతోల్ లక్ష్మయ్యను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆ వీడియోలో కనిపించాయి. ‘లక్ష్మన్న.. గట్టిగా చేయి..పెద్దమనిషి.. పోనీయకుండి…కష్టపడ్డడు…మంత్రిని చేద్దాం..’ కచ్చితంగా అవుతడు.. .టిక్కెట్ వచ్చేటట్టు చేయండి..’ అంతకుముందు మర్రి నేరుగా అంటుండగా నాగం సున్నితంగా వారించారు. ఇలా గత కొన్నినెలలుగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలో నెలకొన్న భయం ఈ విధంగా బాహాటంగా వ్యక్తపరిచినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చజరుగుతోంది. లేకుంటే కాంగ్రెస్ టికెట్ నాగంకు రావాలని మర్రి ఎందుకు కోరుకుంటారని అంటున్నారు. కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ తరఫున బరిలో ఉంటే గెలుపు కష్టంగా మారుతుందని భయమే మర్రిని ఈ విధంగా మాట్లాడించినట్లుగా అక్కడికి వచ్చిన పలువురు గుసగుసలాడారు.