Breaking News

అనాధ వృద్ధులకు చేయూతనందిద్దాం

అనాధ వృద్ధులకు చేయూతనందిద్దాం

సామాజిక సారథి, సిద్దిపేట: అనాధ వృద్ధులకు చేయూతనందిద్దామని బెజ్జంకి తహసీల్ధార్ విజయప్రకాశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ఎక్స్ రోడ్ వద్ద అనాధ వృద్ధులకు నిత్యవసర వస్తువులు, దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవం సందర్భంగా బాలవికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాధ పిల్లలు, వికలాంగులు, వితంతువులు, వితంతువుల పిల్లల అభివృద్ధికి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. బాలవికాస సంస్థ ద్వారా పిల్లలకు యూత్ కన్వెన్షన్ నిర్వహించి, నైతిక విలువతు, తల్లిదండ్రుల విలువతోపాటు, చదువు పట్ల ఆసక్తిని పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. అనాధ వృద్ధులకు సహాయం చేయడంలో భాగస్వామ్యులు కావడంతోపాటు, వృద్ధాప్య దశలో ఉన్నటువంటి పెద్ద వారిని ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకోవాలన్నారు. అనంతరం 31మంది అనాధ వృద్ధులకు 10 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ సెంట్రల్ మేనేజర్ అన్నమేరి బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డీనేటర్లు సుజాతలు, అనాధ వృద్దులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.