Breaking News

క్షయను తరిమేద్దాం..

క్షయను తరిమేద్దాం..


  • టీబీలేని తెలంగాణగా మారుద్దాం
  • ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
  • అవేర్ గ్లెనిగ‌ల్ గ్లోబ‌ల్ ద‌వాఖాన‌లో వ‌రల్డ్ టీబీ డే
  • ఉత్సాహంగా ‘3 కే వాక్‌థాన్‌’ అవ‌గాహ‌న ర్యాలీ

సారథి న్యూస్​, హైదరాబాద్​: క్షయవ్యాధిని నిర్మూలిద్దాం.. 2025 లోపు టీబీలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుదామ‌ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​ రెడ్డి పిలుపునిచ్చారు. బుధ‌వారం వ‌ర‌ల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయ‌వ్యాధి దినం) ను పురస్కరించుకుని ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని బైరామ‌ల్‌గూడ అవేర్ గ్లెనిగ‌ల్ గ్లోబ‌ల్ ద‌వాఖాన ఆధ్వర్యంలో ‘3కె వాక్‌థాన్‌’ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. దేశమంతా పోలియో నివారణ చేసినట్లుగానే క్షయ వ్యాధిని నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. ప్రతిఒక్కరూ క్షయ వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగిఉండి, ముందుగానే పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు.

అనంత‌రం అవేర్ గ్లెనిగ‌ల్ గ్లోబ‌ల్ ద‌వాఖాన క‌న్సల్టెంట్ ప‌ల్మనాల‌జిస్ట్, స్లీప్ ‌మెడిసిన్ డాక్టర్​ సుధీర్‌ప్రసాద్ మాట్లాడుతూ.. 3వ వంతు క్షయవ్యాధి రోగులు మ‌న‌దేశంలోనే ఉన్నార‌ని, టీబీ వ్యాధిపై అవ‌గాహ‌న పెంచుకుంటే స‌మూలంగా నివారించ‌వ‌చ్చని ఆయ‌న సూచించారు. క్షయ వ్యాధిని రూపుమాపేందుకు వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (డ‌బ్ల్యూహెచ్‌వో) 2035 వ‌ర‌కు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2030, 2025 వ‌ర‌కు ల‌క్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. అనంత‌రం ద‌వాఖాన నుంచి స‌రూర్‌న‌గ‌ర్ చెరువు వ‌ర‌కు ‘3కె వాక‌థాన్‌’ అవ‌గాహ‌న ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో లింగోజిగూడ డివిజ‌న్ మాజీ కార్పొరేట్ శ్రీనివాస‌రావు, అవేర్ గ్లెనిగ‌ల్ గ్లోబ‌ల్ ద‌వాఖాన సీసీవోవో డాక్టర్​ మెర్విన్ లియో, మెడిక‌ల్ హెడ్ డాక్టర్​ సుకేశ్‌‌కుమార్‌, ఆప‌రేష‌న్స్ హెడ్ డాక్టర్​ ఇసాక్ సౌమిల్, వైద్యబ్బంది త‌దిత‌‌రులు పాల్గొన్నారు.