- ఐదేళ్లకోసారి సంప్రదాయ అధికారమార్పిడికి చెక్
- రెండోసారి అధికారంలోకి ఎల్ డీఎఫ్
- 1980 తర్వాత అధికారపార్టీ విజయం
తిరువనంతపురం: గతంలో లేని విధంగా ఈ సారి కేరళ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తంగా సాగాయి. దేవభూమిలో ఎలాగైనా పాగా వేయాలని కాషాయదళం సర్వశక్తులూ ఒడ్డింది. తామే అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అలాగే సంప్రదాయ అధికార మార్పిడిలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వం మారే సంప్రదాయానికి ఈసారి తెరపడింది. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో లెఫ్ట్ డ్రెమోక్రటిక్ ఫ్రంట్ 93 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 43 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. బీజేపీ కేవలం ఒకే ఒక సీటుతో సరిపెట్టుకోనుంది. ఎల్ డీఎఫ్ కు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన మలయాళీలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి స్వస్తిపలికారు.
1957లో వామపక్ష ప్రభుత్వం కొలువుదీరగా, ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేరళ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1960లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, 1965లో తిరిగి వామపక్షాలు అధికారం చేపట్టాయి. ఆ తర్వాత 1970 నుంచి కాంగ్రెస్ కూటమిలోని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. 1980లో సీపీఎం అధికారం చేపట్టింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాల అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. అయితే, దీనిని సీఎం పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్ డీఎఫ్ ఈ సారి అధిగమించి చరిత్రను తిరగరాసింది. 2016 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్‌ను పక్కనబెట్టి పినరయి విజయన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఎన్నికల ముందు కేరళలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన బంగారం దొంగ రవాణా కుంభకోణం విజయన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేకపోయాయి. రెండేళ్ల క్రితం వచ్చిన భీకరమైన వరదలు, కరోనా విపత్కర పరిస్థితుల్లో విజయన్ ప్రభుత్వం పాలనాతీరుపై మలయాళీలు సంతృప్తి కనబరిచినందుకే రికార్డు విజయం సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.