Breaking News

 బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు రాజకీయాలను గలీజు చేస్తుండ్రు  

  • దొరల ప్రతినిధులుగా ఎన్నికల కమీషన్
  • బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్

సామాజిక సారథి, మునుగోడు: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు రాజకీయాలను గలీజు చేస్తుండ్రని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఇంటింటా ప్రచారరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గలీజు రాజకీయాలు చేస్తూ, ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదల సమస్యలు, అవసరాలు తీర్చడానికి, నిరుపేదల ఆకలి తీర్చడానికి ఉపయోగించాల్సిన డబ్బును అక్రమంగా రాజకీయ పార్టీల నాయకుల కొనుగోలు కోసం ఉపయోగిస్తున్నారని ధ్వజమేత్తారు. భారతదేశం ఆకలి సూచీలో 110వ స్థానంలో ఉందని, కానీ ప్రభుత్వాలు అవి పట్టించుకోకుండా పేదలనుండి దోచుకున్న డబ్బు, రాజకీయ స్వార్థం కోసం వాడుతున్నారన్నారు. దేవునిపై ప్రమాణం చేయాలని దేవున్ని కూడా అవమానపరుస్తున్నారని పేర్కొన్నారు. మరోపక్క టీఆర్ఎస్ ఓట్ల కోసం వందలాది మందితో కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి బహుజనులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్లను బాగా తాగించి, రోడ్డు ప్రమాదాల్లో ప్రజలను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశాలీలను అవమానపరిచిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పై కేసు నమోదు చేసి,భర్తరఫ్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ పార్టీలకు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, బాపూజీ వంటి మహనీయులు ఓట్ల సమయంలోనే గుర్తుకొస్తారని విమర్శించారు. ఈ రోజు ప్రచారంలో భాగంగా నారాయణపూర్ మండలంలోని పోర్లగడ్డతండ, పల్లగుట్టతండ, గంగములతండ, సఫావత్ తండ, కడపగండితండ, మర్రిబావితండ, రాధానగర్ తండాలో పర్యటించి, ఏనుగు గుర్తుకు ఓటేస్తేనే గిరిజనులకు పోడు పట్టాలు, 10శాతం రిజర్వేషన్లు, గిరిజన బతుకులు మారుతాయన్నారు. రోజురోజుకు బీఎస్పీకి ప్రజాదరణ పెరుగుతుందని తెలిపారు. ఈ రోజు నాంపల్లి మాజీ సర్పంచ్ శైలజ వందలాదిమందితో బీఎస్పీ పార్టీలో చేరారు. మునుగోడు ఉపఎన్నికలో ఎన్నికల అధికారులు, దొరల ప్రతినిధులుగా పని చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.  సమయానికి సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఇది శ్రమ జీవులకు మరియు దోపిడి దొరలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని తెలిపారు. ఈనెల 29న నారాయణ పూర్ మండల కేంద్రంలో జరగనున్న బిఎస్పి బహిరంగ సభకు లక్షలాదిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి అందోజు శంకరాచారి, జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు, పూదరి నర్సింహ, కోనేటి సుజాత, వినోద్, పృథ్వీ, తదితరులు పాల్గొన్నారు.