Breaking News

ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ

ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ

  • లారీ ఢీకొని మహిళల దుర్మరణం
  • పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద దుర్ఘటన
  • తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం కె.చంద్రశేఖర్​రావు

సారథి న్యూస్, నల్లగొండ: రెక్కాడితే గానీ డొక్కాడని పేదింటి బతుకులు.. కూలీ పనులకు వెళ్లినవారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అప్పటిదాకా వరినాట్లు వేసి అలసిసొలసి ముచ్చట్లు, నవ్వులతో ఇంటిదారి పడుతున్నవారంతా ఒక్కసారిగా విగతజీవులుగా మారారు. క్షణాల్లో మాంసపు ముద్దలుగా చెల్లాచెదురయ్యారు. ఈ ఘోరరోడ్డు ప్రమాదం గురువారం సాయంత్రం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద జరిగింది. దేవరకొండ మండలం చింతబావి గ్రామానికి చెందిన 20 మంది మహిళలు పోతులూరు గ్రామంలో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఆటో అంగడిపేట శివారు వద్ద పెట్రోలు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆటోడ్రైవర్ మల్లేశం, నోమల పెద్దమ్మ, నోమల సైదమ్మ, కొట్టం పెద్దమ్మ, గొడుగు ఇద్దమ్మ, మల్లమ్మ, అంజమ్మ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ప్రాణాలు విడిచారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరితో 9 మందిని దేవరకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, మృతుల్లో ఒకరు చింతబావి సర్పంచ్​తల్లి కూడా ఉంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆటోను ఢీకొట్టిన లారీ

సీఎం కేసీఆర్​ తీవ్ర దిగ్భ్రాంతి
అంగడిపేట గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కె.చంద్రశేఖర్​రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్​ సంబంధిత అధికారులను ఆదేశించారు.