సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెండు స్థానాలకు గాను మొత్తం 10మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో ఆరుగురి నామినేషన్లను వివిధ కారణాలతో ఎన్నికల పరిశీలన అధికారులు తిరస్కరించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి కావలి శ్రీశైలం, నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి సుధాకర్ రెడ్డి బరిలో నిలిచారు. బుధవారం సాయంత్రం సుధాకర్‌రెడ్డి పోటీనుంచి తప్పుకున్నారు. నామినేషన్ విత్ డ్రా చేసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావును కలిసి రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. తాజాగా గురువారం మరో స్వతంత్ర అభ్యర్థి కావలి శ్రీశైలం కూడా తాజాగా పోటీ నుంచి విరమించుకున్నారు. ఆయన కూడా ఎన్నికల అధికారులకు రాతపూర్వకంగా రాసి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎవరూ పోటీలో లేకపోవడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దామోదర్‌రెడ్డి, నారాయణరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే అయింది. ఇదిలాఉండగా, చివరిదాకా శ్రీశైలంను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలోనే ఉంచాలని అధికార పార్టీలోని ఓ వర్గం నేతలు చివరిదాకా ప్రయత్నించినట్లు తెలిసింది. చివరికి ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువు ఉంది. కూచకుళ్ల, కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వారికి శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.
Qqq