- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నేడు పాల్వంచ బంద్‌కు పిలుపునిచ్చిన విపక్షాలు
- ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును పక్కన
- పెట్టాలని టీఆర్ఎస్ హైకమాండ్ నిర్ణయం
సామాజిక సారథి, హైదరాబాద్: ఎట్టకేలకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు తనయుడు, కీచక వనమా రాఘవేందర్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. మూడురోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆస్తి తగాదాల నేపథ్యంలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్రకలకలం రేపింది. కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ నిందితుడిగా ఉన్నారు. అతని ఆకృత్యాలపై శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్ కు అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు బహిరంగలేఖ రాశారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని, తన కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటానని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇదిలాఉండగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. రాఘవపై కఠినచర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో మంత్రి కె.తారకరామారావు మాట్లాడారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆయనను పక్కనపెట్టాలని టీఆర్ఎస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం.