Breaking News

కీచక వనమా రాఘవ అరెస్ట్‌

కీచక వనమా రాఘవ అరెస్ట్‌
  • హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నేడు పాల్వంచ బంద్‌కు పిలుపునిచ్చిన విపక్షాలు
  • ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును  పక్కన
  • పెట్టాలని టీఆర్ఎస్ హైకమాండ్​ నిర్ణయం

సామాజిక సారథి, హైదరాబాద్‌: ఎట్టకేలకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​ రావు తనయుడు, కీచక వనమా రాఘవేందర్ ​ను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడురోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆస్తి తగాదాల నేపథ్యంలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో సహా పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్రకలకలం రేపింది. కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ నిందితుడిగా ఉన్నారు. అతని ఆకృత్యాలపై శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌ కు అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు బహిరంగలేఖ రాశారు. చట్టానికి, విచారణకు సహకరిస్తానని, తన కుమారుడు సహకరించేలా బాధ్యత తీసుకుంటానని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్‌ అయింది. రాఘవపై కఠినచర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్​తో మంత్రి కె.తారకరామారావు మాట్లాడారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామాకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఆయనను పక్కనపెట్టాలని టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ నిర్ణయించినట్లు సమాచారం.