- పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని పూర్తిచేయలే
- నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలను తొక్కి పెట్టిన్రు
- మాట ఇస్తున్నా.. ఆగస్టు 15లోగా రుణమాఫీ
- నన్ను ఎలా దించేయాలో కుట్ర చేస్తున్నరు
- పదేళ్లుగా మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు
- కొడంగల్, బిజినేపల్లి సభల్లో సీఎం రేవంత్ రెడ్డి
సామాజికసారథి, కొడంగల్/నాగర్ కర్నూల్ బ్యూరో: పాలమూరుకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కమీషన్ల కక్కుర్తితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉందన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, రాజోలిబండ, తుమ్మిళ్ల ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని పనులు పూర్తిచేస్తానని చెప్పిన కేసీఆర్.. సీఎం అయిన తర్వాత ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో సీఎం ప్రసంగించారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో నిర్వహించిన ‘కాంగ్రెస్ జనజాతర సభ’లో ఆయన ప్రసంగించారు. పదేళ్లుగా నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తొక్కిపెట్టారని అన్నారు. 2009లో కేసీఆర్ ఎంపీగా గెలిపిస్తే పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. 2009లో కృష్ణా నదికి భారీ వరదలు వచ్చినప్పుడు తన ఇల్లు అమ్మి అయినా అలంపూర్‌లో ముంపు బాధితులకు ఇళ్లు కట్టిస్తానన్నారు. ఎందుకు కట్టించలేదని నిలదీశారు.
బీఆర్ఎస్ ను రద్దుచేసుకుంటారా?
జోగులాంబ అమ్మవారి సాక్షిగా, సేవాలాల్ సాక్షిగా మాట ఇస్తున్నానని, ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రుణమాఫీ చేయకపోతే సీఎంగా రాజీనామా చేస్తారా? అని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అడుగుతున్నారని, పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేసుకుంటారా? ఆయన సవాల్ చేశారు. రుణాలు తీర్చాలని రైతులకు నోటీసులిస్తూ ఇబ్బందులకు గురిచేయొద్దని బ్యాంకర్లకు సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రైతులను ఇబ్బందిపెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ‘పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను. ఎన్ని వేల కోట్లయినా నిధులిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రిగా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటా. మీ బిడ్డగా పనులు శాశ్వతంగా నిలిచిపోయేలా పనిచేస్తాను’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కాళ్లల్లో కట్టెపెడుతున్నారు
‘2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీచేస్తామని చెప్పి చేయలేదు. నేను రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాను. అయితే మేము అధికారం చేపట్టేనాటికి ఖజానా దివాలా తీసి.. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి ఉంది. డిసెంబరు 7న సీఎంగా నేను బాధ్యతలు తీసుకున్న రోజున రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.26వేల కోట్ల వడ్డీ చెల్లించాం. అసెంబ్లీకి వస్తే కేసీఆర్‌కు లెక్కలు చూపిస్తాను. ఎన్నికల కోడ్ అడ్డుగా రావడంతోనే రైతు రుణమాఫీ అమలులో ఆలస్యమైంది. నన్ను ఎలా దించేయాలి, కాళ్లలో కట్టెపెట్టి ప్రభుత్వాన్ని ఎలా పడేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మీ హామీలను అమలుచేశారా?
‘100 రోజుల్లో ఆరు గ్యారంటీల్లోని హామీల్లో ఐదింటిని అమలుచేశాం. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా? డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల పంపిణీ, ఇంటికో ఉద్యోగం, ఫీజు రీయింబర్స్మెంట్, కేజీ టూ పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికో వంద పడకల ఆసుపత్రి వంటి హామీలను అమలు చేయలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్ష ఎకరాలకు సాగునీరు అందించారా? ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేశారా? ఇవేమీ చేయకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే రేవంత్‌రెడ్డి దిగిపోవాలని అనడం ఎంతవరకు సమంజసం? ప్రజలను కలవకుండా, వారి కష్టాలు తెలుసుకోకుండా కేసీఆర్ పదేళ్లు ఎలా పాలించారో ప్రజలకు తెలుసు. నేను నాలుగు నెలల్లో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా రోజుకు 18గంటలు పనిచేస్తున్నాను. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. పేదలకు ఇళ్లు నిర్మించలేదు. రైతులకు ఆదాయం రెట్టింపు చేయలేదు. చెప్పుకోవడానికి ఏమీలేక మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.’ అని సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
డీకే అరుణతో నాకు పోటీ ఏంది?
‘పాలమూరు జిల్లాలో నాకు ప్రత్యర్థులు, శత్రువులు ఎవరూ లేరు. పాలమూరు బిడ్డనైన నాకు సీఎంగా అవకాశం వచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నా. బీజేపీ నేత డీకే అరుణతో నాకేమైనా ఆస్తి తగాదాలు.. గట్టు పంచాయతీలున్నాయా? పాలమూరు జిల్లాకు శత్రువులైన వారితో ఆమె జతకట్టారు. సీఎంగా రాజకీయాలకతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నా. ప్రాజెక్టులను ఎలా పూర్తిచేయాలని ఆలోచించా. కానీ, కాళ్లలో కట్టెలు పెట్టి లాగడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? కృష్ణా-వికారాబాద్ రైల్వేలైన్ ఎందుకు పూర్తి చేయలేదు? గతంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ అప్పట్లో కోస్గిలో రెండు వరుసల రోడ్లు ఎందుకు వేయలేదు? మన్నెగూడ, గుల్బర్గా రోడ్డును ఎందుకు బాగుచేయలేదు? గత శాసనసభ ఎన్నికల్లో గద్వాలలో బీజేపీ అభ్యర్థికి 7వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటప్పుడు ఆమెతో నాకు పోటీ ఏంటి?’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్రోహిగా నిలబడతారా?
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తే కేసీఆర్ ఇబ్బంది పెట్టారు. కేసీఆర్‌ను గద్దెదించుతానని ఆ రోజు ప్రవీణ్ అన్నారు. ఆరు నెలల్లోనే కేసీఆర్‌లో ఏం మారింది? ఆయన బీఎస్పీలో కొనసాగినా బాగుండేది. లేకపోతే కాంగ్రెస్‌లోకి వచ్చి కేసీఆర్‌పై కొట్లాడాల్సింది. శాసనసభలో నాతోపాటు సంపత్‌కుమార్ ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెడితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులతో మమ్మల్ని బయటకు పంపించింది. వర్గీకరణపై అఖిలపక్ష పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పి పదేళ్లు సాగదీసింది. వర్గీకరణకు అనుకూలంగా ఉన్న మమ్మల్ని సభలో నుంచి బయటకుపడేసిన కేసీఆర్ పక్కన చేరిన ప్రవీణ్‌కుమార్ వర్గీకరణకు వ్యతిరేకమా? ప్రజలు తిరస్కరించిన కేసీఆర్ పక్కన చేరి తెలంగాణ సమాజం ఎదుట దోషిగా నిలబడతారా? ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఈ రోజు డీజీపీ స్థాయిలో ఆయన ఉండేవారు. ఆయనను టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా నియమించాలని అనుకున్నాం.’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ అభ్యర్థులు మల్లు రవి, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కె.రాజేశ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.