Breaking News

కక్కుడు.. బయటికి!

కక్కుడు.. బయటికి!
  • కల్తీకల్లు తాగి 10 మందికి అస్వస్థత
  • గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు
  • మెదక్​జిల్లా కొంతాన్ పల్లిలో కలకలం

సామాజికసారథి, మెదక్ ​ప్రతినిధి: కల్తీ కల్లు తాగి 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్​పల్లిలో కలకలం రేపింది. గ్రామంలోని ఓ దుకాణంలో కల్లు తాగిన కుల్ల నాగరాజు, బ్యాగరి మనీలా, మడూరి రమేష్, వీరబోయిన స్వామి, తుమ్మల స్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే వీరంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాళ్లు, చేతులు, మెడ, నోరు వంకర్లు తిరిగాయి. ఇది గమనించిన బాధిత కుటుంబసభ్యులు వారిని తూప్రాన్‌లోని ఓ ప్రైవేట్​ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో కొందరి పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. పొరుగు గ్రామమైన తూప్రాన్ మండలం వత్తూరులో కూడా ఇదే కాంట్రాక్టర్ కు చెందిన దుకాణంలో కల్లు తాగిన శివకుమార్‌, యాదగిరి, కొమరయ్య, మహేశ్‌, వరలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పోతులగూడెం గ్రామానికి చెందిన మరో ఇద్దరు కల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారు. శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి గేట్ వద్ద ఉన్న కల్లు దుకాణంలో నిత్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జేఎస్ఆర్ ఫంక్షన్​హాలు ముందు ఉన్న మరో దుకాణంలో కల్తీ కల్లు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నా మాముళ్లకు అలవాటుపడిన ఆబ్కారీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇక్కడ తయారుచేస్తున్న కృత్రిమ కల్లులో మోతాదుకు మించి ఆల్ఫాజోలం, క్లోరోహైడ్రేట్​తదితర మత్తు పదార్థాలను వాడుతున్నారు. ఈ కల్లును తాగిన కొందరు ఎక్కడపడితే అక్కడే పడిపోతున్నారు. బైక్​లపై వెళ్తున్నవారు, రోడ్డు దాటుతున్న వారు ఒక్కోసారి ప్రమాదాల బారినపడుతున్నారు. కల్తీ కల్లు విక్రయాలను నిరోధించే జిల్లా ఎక్సైజ్ అధికారులు కల్లు కాంట్రాక్టర్ల నుంచి అందే మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కృత్రిమ కల్లు తయారీదారులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి శివ్వంపేట మండలంలో కొనసాగుతున్న కృత్రిమ కల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.