- ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి
- జాట్ రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత
సారథి, వికారాబాద్: విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా తరహా ఎక్స్గ్రేషియా చెల్లించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(జాట్) రాష్ట్ర అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి నేత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇల్లు వదిలి బయటికి రానీ విపత్కర పరిస్థితుల్లో కూడా కుటుంబాన్ని పక్కనపెట్టి విధి నిర్వహిస్తున్న జర్నలిస్టులను కొవిడ్ మహమ్మారి కబళించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్)ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ బారినపడిన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, నర్సులతో మొదలుకుని ఉన్నతాధికారులు మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం కేసీఆర్ ప్రకటించాలని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వాలు బాసటగా నిలవాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో మొదలుకొని అనేక రంగాల్లో జర్నలిస్టుల సేవలు గొప్పవని కొనియాడారు. జర్నలిస్టులందరికీ విద్య వైద్య సదుపాయాలు కల్పించి ఆదుకోవాలన్నారు. అనంతరం ఇటీవల విధులు నిర్వహిస్తూ చనిపోయిన జర్నలిస్టుల ఆత్మకు శాంతి కలగాలని, వారి సేవలను స్మరిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. జాట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వికారాబాద్ జిల్లా అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు హాజయ్యారు.