Breaking News

డిగ్రీ చదివితే ఉద్యోగాలు రావాలి

డిగ్రీ చదివితే ఉద్యోగాలు రావాలి

  • విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలి
  • అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు
  • ఏపీ సీఎం వైఎస్ జగన్​మోహన్​రెడ్డి కీలక నిర్ణయాలు

అమరావతి: ఈ సంవత్సరం భర్తీ చేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్​మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిగ్రీపట్టా సాధిస్తే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని, నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కొలేమని పేర్కొన్నారు. ఉగాది రోజున పోస్టుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఆరువేల మంది పోలీసుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులు చేయాలని సూచించారు. అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నపత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అటానమస్ కాలేజీల్లో పరీక్ష విధానం, జగనన్న విద్యాదీవెనపై సమీక్ష సందర్భంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని కాలేజీలకీ జేఎన్టీయూ తయారుచేసిన ప్రశ్నపత్రాలే ఉండాలని నిర్ణయించారు అటానమస్, నాన్ అటానమస్ కాలేజీలకు ఇవే ప్రశ్నపత్నాలు ఉంటాయి. ప్రశ్నపత్రాల వాల్యూయేషన్ కూడా జేఎన్టీయూకే అధికారం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి విద్యార్థి నైపుణ్యంతో, సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో ముందుకు రావాలని సూచించారు. ప్రతి కోర్సులో అప్రెంటిస్ విధానం తీసుకురావాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకురావాలని, ఆర్ట్స్ లో మంచి, కొత్త సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని దిశానిర్దేశం చేశారు.