Breaking News

జల్లికట్టు సంబురాలు ప్రారంభం

జల్లికట్టు సంబురాలు ప్రారంభం
  • తమిళనాడు సంక్రాంతి వేడుకలు
  • 31 వరకు అమలులో కరోనా నిబంధనలు

చెన్నై: పొంగల్‌ సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జల్లికట్టు క్రీడా పోటీలు రాష్ట్రంలో ముందుగా పుదుకోట జిల్లాలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు పశు సంవర్థక శాఖ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించిన 300 పోట్ల గిత్తలు, రెండు టీకాలు వేసుకున్న 700 మంది యువకులను ఈ పోటీలకు అనుమతించారు. జిల్లాలోని గంధర్వకోట సమీపంలో

వున్న తచ్చాంకుర్చి గ్రామంలో ఉదయం రాష్ట్ర మంత్రులు రఘుపతి, మెయ్యనాథన్‌, జిల్లా కలెక్టర్‌ కవితా రాము తదితరులు జల్లికట్టును లాంఛనంగా ప్రారంభించారు. పొంగల్‌ రోజుల్లో జల్లికట్టు నిర్వహించేందుకు మదురై, పుదుకోట తదితర జిల్లాల్లో ఏర్పాట్లు చురుకుగా సాగాయి. మరోవైపు సొంతూళ్లలో భోగి, మకర సంక్రాంతి, పశువుల పండుగలను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు భారీగా జనం తరలివెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ఉత్సాహంగా, సంప్రదాయ బద్ధంగా నిర్వహించుకునేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. సంక్రాంతికి రాజధాని నగరం చెన్నై సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముస్తాబయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పొంగల్‌ కానుకల పంపిణీతో ప్రజల్లో ఆనందాన్ని నింపగా, మరో వైపు ప్రజలు కూడా పొంగల్‌ షాపింగ్‌లో బిజీ అయిపోయారు.

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైర్‌సను నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 31వ తేదీ వరకు కరోనా నిబంధనలు అమలులో వున్నందున సంక్రాంతి, పశువుల పండుగ, కానుం పొంగల్‌ రోజుల్లో ప్రజలు మెరీనా తీరానికి వెళ్లి ఉల్లాసంగా గడపడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎంజీఆర్‌ సమాధి మొదలుకొని లైట్‌హౌస్‌ వరకు పోలీసులు వాచ్‌టవర్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. మెరీనాబీచ్‌కు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఇదిలావుంటే కేరళలో తమిళులు అధికంగా నివసించే ఆరు జిల్లాల్లో శనివారం సంక్రాంతి సెలవు ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌కు లేఖ రాశారు. దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌ వెంటనే స్పందించి ఆరు జిల్లాల్లో సంక్రాంతికి స్థానిక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.