సారథి, అచ్చంపేట: ఆదాయం కోసం సర్కారు భూములను అమ్మడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా నాయకురాలు, అచ్చంపేట 10వ వార్డు కౌన్సిలర్ సునీతారెడ్డి మండిపడ్డారు. మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజా అవసరాలు స్కూళ్లు, ఆస్పత్రులు, గోదాములు తదితర వాటి కోసం ప్రభుత్వ ఆస్తులను వినియోగించాలి కానీ ఇలా విక్రయించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ ఏడేళ్లలో తెలంగాణ ఆదాయమంతా ఎవరి పాలైందో సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారిందన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నా, ధాన్యం కొనుగోలు చేయాలన్నా, మహిళలకు రుణాలు ఇవ్వాలన్నా నిధులు లేవని సాకులు చెప్పే ప్రభుత్వానికి కార్ల కొనుగోలుకు డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమంగా ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని.. లేనిపక్షంలో మరో ప్రజాపోరాటం తప్పదని సునీతారెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు జ్యోతిరెడ్డి, కవిత, కమల, స్వరూప, మమత పాల్గొన్నారు.
- June 15, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- ACHAMPET
- CONGRESS
- అచ్చంపేట
- కాంగ్రెస్
- Comments Off on ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదు