Breaking News

పిల్లలను దూషించినా, ఇబ్బందిపెట్టినా నేరమే

పిల్లలను దూషించినా, ఇబ్బందిపెట్టినా నేరమే

సారథి న్యూస్, మెదక్: బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​సభ్యుడు డాక్టర్​ఆర్జీ ఆనంద్​ అన్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు వారికి ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్నారులను దూషించినా, ఇబ్బందులు కలిగించినా వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. శుక్రవారం మెదక్ ​కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ​హరీశ్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో ‘పిల్లలు.. వారి హక్కులు’పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమశాఖ, బాలల సంరక్షణ కమిటీ, చైల్డ్​వెల్ఫేర్​ పోలీస్, విద్యాశాఖ అధికారులు బాల్యవివాహాలు జరగకుండా చూడాలని కోరారు. చిన్నతనంలోనే జరిగే పెళ్లిళ్లతో కలిగే అనర్థాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో పిల్లలు, వారి తల్లిదండ్రులకు స్కూళ్లకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మెదక్ ​జిల్లాను చైల్డ్​ఫ్రెండ్లీ విలేజీగా మార్చాలని డాక్టర్ ​ఆనంద్ ​సూచించారు. కలెక్టర్ ​హరీశ్​ మాట్లాడుతూ.. జిల్లాలో అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషిచేయాలని సూచించారు. అనంతరం మెదక్​ పట్టణంలోని బాలికల హైస్కూలును సందర్శించారు. సమావేశంలో మెదక్​ డీఈవో రమేష్ కుమార్, డీఎంహెచ్​వో డాక్టర్​ వెంకటేశ్వర్​రావు, చైల్డ్​వెల్ఫేర్ ​కమిటీ చైర్​పర్సన్​ శివకుమారి, ఎస్సీ కార్పొరేషన్​ఈడీ దేవయ్య, డీఎస్పీ కృష్ణమూర్తి, మెదక్​ ఆర్డీవో సాయిరామ్, సీడీపీవోలు హేమభార్గవి, పద్మావతి, భార్గవి, డీసీపీవో కరుణశీల, ఈవో పద్మలత, ఐసీపీఎస్ చైల్డ్​లైన్​ సభ్యులు అశోక్ పాల్గొన్నారు.