- మంత్రి గంగుల కమలాకర్
సామాజికసారథి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష, పోలీసులు భగ్నం చేయడంపై ఆదివారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని నిలదీశారు. ఢిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే జీవోనం.317 ఇచ్చామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించే బాధ్యత బీజేపీ నేతలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. కొవిడ్ వ్యాప్తి పెరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం కొవిడ్ ఆంక్షలు విధించట్లేదా? అని గంగుల ప్రశ్నించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టం తనపని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. కరీంనగర్ పోలీసులను అభినందిస్తున్నట్లు తెలిపారు. సమూహం లేకుండా బండి సంజయ్ దీక్ష చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. బండి సంజయ్‌ది జాగరణ దీక్ష కాదని, కొవిడ్‌ను వ్యాప్తి చేసే దీక్ష అని విమర్శించారు. ఎవరైనా కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుల అనుమతి కూడా లేకుండా దీక్ష చేయొచ్చా? అని ప్రశ్నించారు.