Breaking News

పేద విద్యార్థులకు ‘అనంత’సాయం

పేద విద్యార్థులకు ‘అనంత’సాయం

  • ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సహాయం
  • అనంత జ్యోతిర్మయి సంస్థ ద్వారా సామాజికసేవ
  • నలుగురు విద్యార్థులకు బంగారు భవిష్యత్​
  • పదిమందికి సహకరించడమే సంకల్పం: అనంత నరసింహారెడ్డి

సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: నిరుపేద విద్యార్థుల పాలిట దైవంగా నిలిచారు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ అనంత నరసింహారెడ్డి. సామాజిక సేవే ధ్యేయంగా తనవంతు కృషిచేస్తూ భరోసా కల్పిస్తున్నారు. అనంత జ్యోతిర్మయి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అన్నిరంగాల్లో సామాజిక సేవ చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తన సంస్థ ఆధ్వర్యంలో నరసింహారెడ్డి బిజినేపల్లి మండలం వట్టెం వెంకటేశ్వర ఆలయంలో పనిచేస్తున్న రెండు కుటుంబాలకు సంబంధించి నలుగురు విద్యార్థులను చేరదీసి ఉన్నతవిద్యను అందిస్తున్నారు. కొన్నేళ్లుగా వారి యోగక్షేమాలు చూసుకోవడమే కాకుండా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో తన సొంత ఖర్చులతో చదివిస్తున్నారు.
పేద విద్యార్థులకు సాయం
నాగర్ కర్నూల్ కు చెందిన అనురాధ అనే మహిళ పాలెం ఆలయంలో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కొడుకులు రోహిత్ రెడ్డి, జితేందర్ రెడ్డికి విద్యావకాశాలు అందించేందుకు నరసింహారెడ్డి తనవంతు సాయం అందిస్తున్నారు. ఇద్దరు చక్కగా చదువుకొని ప్రస్తుతం హైదరాబాద్​లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే వట్టెం గ్రామానికి చెందిన శారద, శ్రీనివాసులు దంపతుల ఇద్దరు కొడుకులు గౌతమ్​డిగ్రీ చదువుతుండగా, మధుసూదన్ ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్నాడు. ప్రతినెలా నరసింహారెడ్డి తన సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ వారిని ఉన్నతవిద్యను అభ్యసించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటూ హాస్టల్ వసతి, కాలేజీ, ట్యూషన్, ఇతర ఫీజులు చెల్లించి బంగారు భవిష్యత్​అందిస్తున్నారు.
మాకు ఆశాజ్యోతి
విద్యార్థులు గౌతమ్ మాట్లాడుతూ తమకు నరసింహారెడ్డి చాలా అండగా నిలిచారని, ఆయన సహకారంతోనే తనతోపాటు తన తమ్ముడు చదువుకో గలుగుతున్నామని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. బీటెక్ చదువుతున్న రోహిత్ రెడ్డి, జితేందర్ రెడ్డి కూడా నరసింహారెడ్డి సారు రుణం తీర్చుకోలేనిది కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ తమకు అండగా నిలిచి తమ అభివృద్ధికి బాటలు వేసిందని, సంస్థ సహకారం లేకపోతే తమ పరిస్థితి దారుణంగా ఉండేదని చెబుతున్నారు. నరసింహారెడ్డి తమ పిల్లల పట్ల ఎంతో ఉదారత కనబరిచి ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహకరించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆయన సేవలు మరువలేనివని తమ జీవితాల్లో వెలుగులు నింపిన ఆశాజ్యోతి నరసింహారెడ్డి అంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఆ సంకల్పమే నడిపించింది..
స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నా. పదిమందికి సహకరించాలనే తలంపుతో అనంత జ్యోతిర్మయి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసిన. నిరుపేద యువతకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలు లేనివారికి సహకరించి.. మెరుగైన అవకాశాలు కల్పించి వారిని తీర్చిదిద్దడమే నా సంకల్పం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో పేద విద్యార్థులకు నా వంతు సహాయం అందించే అవకాశం దొరికింది.
:: అనంత నరసింహారెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్