Breaking News

విద్యుత్​చార్జీల పెంపు

విద్యుత్ చార్జీల పెంపు
  • ప్రతిపాదనలు సమర్పించిన డిస్కంలు
  • ఆర్థికభారం తగ్గించుకునే ప్రభుత్వం చర్యలు

సామాజికసారథి, హైదరాబాద్‌: ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్‌ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు రూ.ఆరువేల కోట్ల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్‌ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది. సుమారు ఐదేళ్ల తర్వాత విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉండగా.. ఈ భారమంతా వినియోగదారులైన ప్రజలపై పడనుంది. ప్రతిపాదన ప్రకారం.. గృహ వినియోగదారులపై యూనిట్‌పై 50పై, వాణిజ్య వినియోగదారులకు రూపాయి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించాయి. ఇక డిస్కమ్‌లకు రూ.10వేల కోట్ల ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచడం తప్పదనే సంకేతాలు అందించింది. డొమెస్టిక్‌ కనెక్షన్‌ల పై యూనిట్‌ కు రూ.50పైసలు పెంపు ద్వారా రూ.2,110 కోట్లు ఆదాయం, హెచ్‌టీ కనెక్షన్ల రూపాయి పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం రానున్నట్లు డిస్కంలు చెబుతున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్‌ వినియోగదారులకు 101 యూనిట్స్‌ వరకు ఉచిత విద్యుత్‌, 25.78 లక్షల పంపుసెట్లకు  24 గంటలు ఉచిత విద్యుత్‌, సెలూన్లకు 250 యూనిట్స్‌ వరకు ఉచిత విద్యుత్​తో పాటు పవర్‌ లూమ్స్‌, పౌల్ట్రీరంగానికి యూనిట్‌ కు రూ. రెండు చొప్పున సబ్సిడీ ఉంది. రైల్వేచార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్‌ చార్జీల పెంపు అనివార్యమైందని అధికారులు చెబుతున్నారు.