సారథి న్యూస్, అలంపూర్(మానవపాడు): జోనల్ వ్యవస్థకు అనుమతించకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి విమర్శించారు. దేశంలో న్యాయవాదులకు రూ.100 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ఫంక్షన్ హాల్ లో అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అధ్యక్షతన టీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి ప్రైవేటుపరం చేస్తోందని, భవిష్యత్ ఈ సంస్థల్లో రిజర్వేషన్లు లేకపోతే బడుగు, బలహీనవర్గాలు ఉద్యోగాలు లేక తీవ్రంగా నష్టపోతారని అన్నారు. లాక్ డౌన్ సమయంలో లక్షలాది మంది కార్మికులు, కూలీలను ప్రత్యేకంగా రైళ్లు వేసి పంపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, కేసీఆర్ సర్కారు మాత్రమేనని అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో ఆయా పట్టణాలు నూతన ఆర్థిక కేంద్రాలుగా ఎదిగాయని వివరించారు. కేంద్రం జోనల్ వ్యవస్థకు అనుమతిస్తే వెంటనే ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయని అన్నారు. దేశంలో జాతీయ మీడియా అమ్ముడుపోయిందని, రైతుల ఉద్యమాన్ని, వాస్తవాలను దేశప్రజలకు తెలియనివ్వడం లేదని ధ్వజమెత్తారు. సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం, ఎన్నికల ఇన్చార్జ్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్మన్ సరిత, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
- March 2, 2021
- Archive
- Top News
- పొలిటికల్
- ALAMPUR
- CM KCR
- SURABHI VANIDEVI
- TRS
- అలంపూర్
- టీఆర్ఎస్
- తెలంగాణ
- వాణిదేవి
- వ్యవసాయశాఖ
- సీఎం కేసీఆర్
- Comments Off on ప్రభుత్వ సంస్థలు లేకపోతే.. ఉద్యోగాలుండవ్