Breaking News

అక్రమకేసులు బనాయిస్తున్రు

అక్రమ కేసులు బనాయిస్తుండ్రు

సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని డీసీసీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్​ కేడం లింగమూర్తి అన్నారు. మంగళవారం పట్టణంలోని అఖిలపక్ష నాయకులు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ను ఈ ప్రాంత ప్రజలు రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజారోగ్యాన్ని గాలికొదిలి పాలిస్తున్నారని మండిపడ్డారు. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు కొవిడ్ ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని ఈనెల 9న స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఎదుట ఆందోళన చేసిన కాంగ్రెస్ నాయకుడిపై టీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహంతో కేసులు పెట్టడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.

కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, జనగాం జిల్లాల సరిహద్దుతో పాటు సీఎం కేసీఆర్ సొంత జిల్లా హుస్నాబాద్ డివిజన్ కేంద్రంలో 50 పడకల ఆస్పత్రులు ఉన్నా ఒక్క కొవిడ్ ఐసొలేషన్ సెంటర్ ముంజూరు చేయని దౌర్భగ్యస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికైనా మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు స్పందించి హుస్నాబాద్ ప్రాంతంలో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కోమటి సత్యనారాయణ, పట్టణాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు కవ్వ వేణుగోపాల్ రెడ్డి, బోనగిరి రవి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సుదర్శనాచారి, టీడీపీ నాయకులు వరియోగుల శ్రీనివాస్, ఫార్వాడ్ బ్లాక్ పార్టీ నాయకులు పచ్చిమట్ల రవి తదితరులు పాల్గొన్నారు.