సామాజికసారథి, బిజినేపల్లి: ఓ తండ్రి పంతం, పట్టింపు నైజం.. పోలీసుల పట్టించుకోని తనం.. వెరసి ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసింది. ఆపరేషన్ పత్రాలపై సకాలంలో సంతకం చేయకపోవడంతో ఆ బిడ్డ కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన ఆదివారం వెలుగుచూసింది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన మహేశ్వరి, రేవెల్లి గ్రామానికి చెందిన టపా మహేష్ కు మూడేళ్ల క్రితం వివాహమైంది. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులకు కూతురు పుట్టింది. ఆ చిన్నారికి ఇప్పుడు 11 నెలలు.. బిడ్డ గుండెకు రంధ్రం ఉందని తెలసి మహేశ్.. తల్లీబిడ్డను వదిలేశాడు. మహేశ్వరి గుండె ధైర్యంతో హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో కొంతకాలం వైద్యం చేయించింది. అక్కడి డాక్టర్లు కొద్దిరోజులుగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆ పాపకు కచ్చితంగా ఆపరేషన్ చేయాలని సూచించారు. సంబంధిత పత్రాలపై తండ్రి సంతకం కావాలని అడిగారు. మహేశ్వరి ఈ విషయాన్ని తన భర్త మహేశ్‌కు చెప్పింది. ఆపరేషన్ కోసం డాక్టర్లు తండ్రి సంతకం అడుగుతున్నారని వేడుకున్నా అతడు వినిపించుకోలేదు. బిడ్డను బతికించాలంటే తన భర్త సంతకం కావాలని బాధితురాలు మహేశ్వరి గతనెల(సెప్టెంబర్) 30న బిజినేపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఎలాగైనా తన భర్తను పిలిపించి సంతకం చేసేలా ఒప్పిస్తే బిడ్డను బతికించుకుంటానని పోలీసుల కాళ్లావేళ్లపడింది.
పోలీసుల ఉచిత సలహా
మహేశ్వరి ఫిర్యాదుపై స్పందించిన ఎస్సై ఓబుల్ రెడ్డి మీరు ముందు పాపను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. భర్తను పిలిపించి కౌన్సెలింగ్ కూడా ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలో ఒకరోజు ఆగి డబ్బులు, ఇతరత్రా వాటిని రెడీ చేసుకుని ఆదివారం ఆస్పత్రికి బయలుదేరింది. పరిస్థితి విషమించడంతో చిన్నారి మార్గమధ్యంలోనే చనిపోయింది. పెంచిన చేతుల్లోనే ఆ బిడ్డ ప్రాణం గాల్లో కలిసిపోవడంతో తల్లి గుండె తల్లడిల్లింది. పాప మృతదేహంతో బిజినేపల్లి స్టేషన్‌కు వచ్చి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిడ్డను చూపిస్తూ గుండెలవిసేలా రోదించింది. పోలీసులు తన భర్తను పిలిపించి సంతకం చేయించి ఉంటే తన పసిబిడ్డ బతికేదని మహేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనా చిన్నపాటి సంతకం లేక ఒక పసికూన మృతిచెందడం ప్రతిఒక్కరినీ కలిచివేసింది.