Breaking News

నేనున్నానని..

నేనున్నాను...
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్‌ పర్యటన
  • మరణించిన వారి కుటుంబాలకు భరోసా
  • ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తానని హామీ

సామాజిక సారథి, కడప: కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గురువారం పర్యటించారు. వరద బాధితులతో నేరుగా మాట్లాడారు. నష్టం వివరాలను, వరద ప్రమాద వివరాలను ప్రజల నుంచి ఆరాతీశారు. ప్రభుత్వం అందించిన సాయంపైనా అడిగి తెలుసుకున్నారు. పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. రాజంపేట మండలంలో సీఎం జగన్‌ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. రాజంపేట మండలం మందపల్లి, పులపుత్తూరులో వరద బాధితులను సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. వరద బాధితులు, రైతులతో మాట్లాడిన సీఎం వైఎస్‌ జగన్‌ వారిని ఓదార్చారు. అలాగే అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే శుక్రవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాలు, పెన్నానదీ పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను స్వయంగా పరిశీలించి.. అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకుని అక్కడ నుంచి తాడేపల్లికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. కడపలో సీఎం వైఎస్​జగన్​కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ జకియాఖానం, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, దాసరి సుధ, మేయర్‌ సురేష్‌ బాబు, ఎమ్మెల్సీలు గోవింద రెడ్డి, రమేష్‌ యాదవ్‌, సి.రామచంద్రయ్య స్వాగతం పలికారు.