- అనేక రోడ్లకు నిధులు మంజూరు చేయించాం
- షేక్ పేట్ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సామాజికసారథి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన షేక్ పేట్ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. నగర వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరం రోజురోజుకు విస్తరిస్తోందని, ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు కూడా వచ్చి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అందరం కృషిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గత 75 ఏళ్లలో ఎన్నో జాతీయ రహదారులు నిర్మించారు. అయితే ఏడేళ్లలో అంతకన్నా ఎక్కువ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. చాలా రోడ్లను కేంద్రం మంజూరు చేసిందని, కేంద్రమంత్రి నితన్ గడ్కరీని రప్పించి వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో సైన్స్ సిటీ ఏర్పాటు చేయాలని, అందుకోసం 25 ఎకరాల భూమి అవసరం ఉందన్నారు. అలాగే సెవెన్ టొంబ్స్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వదేశీ దర్శన్ పథకంలో నిధులు మంజూరు చేస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. దానికి సంబంధించిన భూమి త్వరగా సేకరిస్తే తొందరగా అందుబాటులోకి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు కె.తారక రామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.