Breaking News

కొట్ర ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ

ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఇటీవల పున:ప్రతిష్టాపన చేసిన అభయ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలుపడ్డారు. భక్తులు సమర్పించిన కానుకలను ఉంచిన హుండీని రాత్రికిరాత్రే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. హుండీలో సుమారు రూ.రెండులక్షల మేర ఉండవచ్చని గ్రామ సర్పంచ్, ఆలయ ధర్మకర్త పొనుగోటి వెంకటేశ్వర్​రావు తెలిపారు. కాగా, ఆలయం పున:నిర్మాణం అనంతరం మార్చి 23, 24, 25వ తేదీల్లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించారు. విశేషసంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకుని కట్నకానుకలు సమర్పించారు. అయితే హుండీ ఆలయం ఆవరణలో ఏర్పాటు చేయడంతో దొంగలు చాలా చాకచక్యంగా ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆలయాన్ని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఆలయంలో హుండీ చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్దండ ఎస్సై ఎం.నర్సింహులు తెలిపారు.