- సాగునీరు అందక బీళ్లుగా పంటపొలాలు
- అధికారులను కలిసినా పరిష్కారం కాని సమస్య
సామాజికసారథి, వనపర్తి: అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. పంటలు పండక దిక్కుతోచనిస్థితి ఎదురవుతోంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూర్ గ్రామంలో ఓ రైతు పంట కాల్వను పూడ్చి వేయడంతో ఆ కాల్వపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా రావడం, ఇప్పుడిప్పుడే జూరాల ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని దిగువకు వదలడంతో రైతులంతా ఆలస్యంగానైనా వరినాట్లు వేస్తున్నారు. ఇతర పంటలను సాగుచేసుకుంటున్నారు. కానీ సూగూరు గ్రామంలోని కొందరు రైతులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూగూరు గ్రామం రామేశ్వరాపూర్ శివారులోని జూరాల డీ20 మైనర్ కాల్వ గత 12 ఏళ్లుగా ఉంది. ఈ కాల్వ ద్వారా అనేక మంది రైతులు పంటలు పండిస్తున్నారు. కాగా, ఇటీవల గ్రామానికి చెందిన రైతు సయ్యద్ ఆరిఫుద్దిన్ అలియాస్ ముజాకర్ తన పొలంలో 12 ఏళ్లుగా ఉన్న జూరాల మైనర్ కాల్వను కొత్తగా పెట్టిన పండ్లతోట పాడవుతుందని రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పూడ్చివేశాడు. కాల్వ నీటిపై ఆధారపడిన కొంతమంది రైతులు ఈ విషయాన్ని పీజేపీ డీఈఈ భావన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన డీఈఈ సమస్య ఏమిటో పూర్తిగా తెలుసుకుని సమస్యను పరిష్కరించాలని పెబ్బేరు ఏఈ మతీన్ ను ఆదేశించారు. డీఈఈ ఆదేశాలతో పెబ్బేరు ఏఈ మతీన్, వర్క్ ఇన్ స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఇతర సిబ్బంది రామేశ్వరాపూర్ శివారులోని జూరాల కాల్వను సోమవారం పరిశీలించారు. కానీ అధికారులు కాల్వ పూడ్చిన రైతును సమర్థించి బాధిత రైతులను భయపెట్టారు. సమస్యను పరిష్కరించకుండా మీకు కాల్వ కావాలంటే తాము ఏమి చేయలేమని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఆ రైతు సాగు చేస్తున్న పండ్ల తోట దెబ్బతింటుందని అతని పొలంలో కాల్వ కావాలంటే రైతులందరు కలిసి డబ్బులు ఖర్చు చేసి పైప్ లైన్ వేసుకుని వెళ్లాలని ఉచిత సలహాఇచ్చారు. ఇదివరకే ఉన్న కాల్వను రైతు సయ్యద్ ఆరీపుద్దీన్ పూడ్చివేయడం తప్పే అయినా ఏఈ మతీన్ కాని ఇతర అధికారులు పట్టించుకోకుండా అతనికే సపోర్ట్ చేయడంపై విమర్శలకు తావిస్తోంది.
పరిష్కారం చూపని అధికారులు
జూరాల అధికారులు సమస్యను పరిష్కరించకుండా అక్కడినుంచి వెళ్లిపోవడంతో బాధిత రైతులు సదరు కాల్వ పూడ్చిన రైతును నిలదీశారు. కానీ రైతు సయ్యద్ ఆరీపుద్దీన్ మాత్రం కొత్త షరతు విధించాడు. మిగతా రైతులు సంతకాలు చేసి ఇస్తేనే కాల్వతీసుకునేందుకు అనుమతిస్తానని షరతుపెట్టాడు. కాల్వస్థానంలో తన పొలంలో పైప్ లైన్ వేసుకోవాలని తన పండ్ల తోటలో మొక్కలు దెబ్బతింటే రైతులు నష్టపరిహారం చెల్లిస్తామని బాండ్ పేపర్ మీద సంతకాలు చేసి ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. చిన్న సమస్యను జూరాల అధికారులు పరిష్కరించకుండా రైతులు గొడవ చేసుకుని తలలు పగులగొట్టుకునే విధంగా నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారని ఆరోపించారు. రైతులు అతని డిమాండ్లు చూసి నివ్వెరపోతున్నారు. కాల్వపూడ్చిన విషయంపై పెబ్బేరు పోలీసులకు ఫిర్యాదుచేసినా కాల్వ పూడ్చిన రైతు డిమాండ్లు ఒప్పుకోవాలని చెప్పడం విశేషం. దీంతో రైతులు న్యాయం కోసం వనపర్తి జిల్లా కలెక్టర్, జూరాల ఉన్నతాధికారులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.