- ఆర్చరీ టోర్నీ రాష్ట్రానికే గర్వకారణం
- మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
సామాజికసారథి, హైదరాబాద్: యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్టీపీసీ వంటి సంస్థలు ఆర్చరీ (విలువిద్య) క్రీడలను నిర్వహించడానికి ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో మొదటి ఎన్టీపీసీ నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. దేశంలో అతిపెద్ద గేమ్ గా ఆర్చరీ టోర్నమెంట్ నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా గౌరవ అతిధిగా హాజరైన ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ సత్య మాట్లాడుతూ… దేశంలోనే విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఎన్టీపీసీ ఎదిగిందన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్)లో భాగంగా ఎన్టీపీసీ వివిధ సేవా ,క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందన్నారు. దేశంలో క్రీడల ఉన్నతికి ఎన్టీపీసీ తనవంతు సాయం చేస్తుందని, ఆర్చరీ ఆఫ్ ఇండియాకు 2018 నుంచి సహకారం అందిస్తున్నామని అన్నారు.
విలువిద్యలో ప్రావీణ్యం ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏఏఐతో కలిసి పనిచేస్తామన్నారు. దేశంలో ఆర్చరీ విద్యకు మరింత మెరుగులు పెట్టేందుకు పనిచేస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ సెక్రకటరీ జనరల్ ప్రమోద్ చందూర్కర్ పేర్కొన్నారు.