Breaking News

ఇదిగో లెక్క!

– తెలంగాణ అభివృద్ధికి రూ.5 లక్షల 27వేల కోట్లు
– వివిధ కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్వం మంజూరు
– గుజరాత్‌ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు
– కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి ప్రజెంటేషన్​

సామాజికసారథి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో రూ.5 లక్షల 27వేల కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి వెల్లడించారు. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్రం తెలంగాణకు రూ. 8,379 కోట్లు ఇచ్చిందని తెలిపారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై బాగ్‌ లింగంపల్లిలో ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎటువంటి సాయం అందడం లేదని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చెందిన మంత్రులు ప్రకటనలు చేస్తుండటంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్వయంగా ఈ ఆరోపణల్ని ఖండిచేందుకు ప్రజల ముందు.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను బయట పెట్టారు. ‘రిపోర్టు టూ పీపుల్‌‘ పేరుతో తెలంగాణ ప్రజల ముందు ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు ఇచ్చామో ప్రజల ముందు పెడుతున్నట్లు చెప్పారు. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని కిషన్‌ రెడ్డి తన రిపోర్టులో తెలిపారు. రాష్ట్రాలకు సంపూర్ణ సహకారంలో భాగంగా తెలంగాణకు కేంద్రం రూ.1.78 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. రోడ్ల కోసం రూ.1.08 లక్షల కోట్లు, రైల్వేల కోసం రూ.32,823 కోట్లు కేటాయించిందని చెప్పారు.

బస్తీ దవాఖానాలకు నిధులు
‘2020-22 కరోనా కాలంలో కూడా ఇచ్చిన రూ.6,950 కోట్ల రుణాన్ని కూడా కేంద్రమే భరించింది. జీఎస్టీ పరిహారం కింద మొత్తం 15 వేల 329 కోట్ల రూపాయలు ఇచ్చింది. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు రూ. 9.26 లక్షల కోట్లు వ్యక్తి గత రుణాలు కేంద్రం ఇచ్చింది. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మీద కేంద్రం కేటాయించిన నిధులు రూ.1.35 లక్షల కోట్లు. పార్లమెంట్‌ నియోజకవర్గాల అభివృద్ధి నిధులు కింద రూ.983 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి, సామాజిక మౌలిక సదుపాయాలు కల్పినకు కేంద్రం రూ. 2250 కోట్లు ఇచ్చింది. రాష్ట్రాల పన్నులవాటా పంపిణీని 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని కిషన్‌రెడ్డి తెలిపారు. బస్తీ దవాఖానాల కోసం తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు రూ.902 కోట్లు.’అని ఆయన వెల్లడించారు.

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.2250 కోట్లు
‘2014 నుంచి పన్నుల వాటా రూపంలో తెలంగాణకు అందిన మొత్తం రూ.1.60 లక్షల కోట్లు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా కేంద్రం.. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు రూ.6,438 కోట్లు. కరోనా టైంలో అత్యవసర ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ప్యాకేజీ కింద తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు రూ.685 కోట్లు. తెలంగాణలో 7.8 కోట్ల కరోనా డోస్‌లు ఉచితంగా కేంద్రం ఇచ్చింది. ఇందుకోసం తెలంగాణకు కేంద్రం ఖర్చు చేసిన నిధులు రూ.1800 కోట్లు’ అని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి వివరించి చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మీద కేంద్రం కేటాయించిన నిధులు రూ.1.35 లక్షల కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి, సామాజిక మౌలిక సదుపాయాలు కల్పినకు కేంద్రం రూ.2250 కోట్లు ఇచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 18 వందేభారత్‌ రైళ్లలో రెండు తెలంగాణలో నడుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అనేక రైల్వేస్టేషన్లను అబివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భూ సేకరణ కారణంగా వరంగల్‌, కొత్తగూడెం విమానాశ్రయాల ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. రోడ్ల నిర్మాణంలో గుజరాత్‌ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు కేటాయించిందని తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులు ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్‌ రెండవ దశ చాలా రోజులు ఆలస్యమైందని చెప్పారు. కార్యక్రమానికి బండి సంజయ్‌, లక్ష్మణ్‌, డీకే అరుణ, గరికపాటి మోహనరావు, వివేక్‌, మర్రి శశిధర్‌ రెడ్డి, పొంగులేటి ఇతర ప్రముఖలు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌ వచ్చారు.