Breaking News

మెట్రోలో గుండె పదిలంగా..

మెట్రోలో గుండె పదిలంగా.. ‘అపోలో’కు

సారథి న్యూస్, హైదరాబాద్: ఓ వ్యక్తి చనిపోయి మరొకరికి ప్రాణం పోశాడు. బ్రెయిన్​ డెడ్​ అయిన సదరు వ్యక్తి గుండెను మరొకరికి అమర్చేందుకు మెట్రో రైలు ద్వారా నిమిషాల్లో తీసుకెళ్లారు డాక్టర్లు. వివరాల్లోకెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​కు చెందిన వరకంతం నరసింహారెడ్డి(45) ఆదివారం అధిక రక్తపోటుతో ఎల్బీ నగర్ లోని ​కామినేని ఆస్పత్రిలో చేరాడు. బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అవయవదానానికి కుటుంబసభ్యులు అంగీకరించడంతో మరొకరికి ఆ గుండెను అమర్చేందుకు జూబ్లీహిల్స్ అపోలో ప్రముఖ వైద్యుడు గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో మంగళవారం శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు.

గుండెను తీసుకెళ్తున్న వైద్యులు, సిబ్బంది

గుండెను ఇలా తరలించారు
అయితే తొలిసారి హైదరాబాద్ లో నాన్​స్టాప్​ మెట్రో సేవలను వినియోగించారు. ఇందుకోసం నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్​పోస్టు వరకు గ్రీన్ చానెల్ ను ఏర్పాటు చేశారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్​ వరకు వరకు 21 కి.మీ. దూరంగా ఉండగా.. నాన్ స్టాప్ మెట్రో ఈ దూరాన్ని 30 నిమిషాల్లోనే చేరింది. అనంతరం ప్రత్యేక అంబులెన్స్ లో అన్ని జాగ్రత్తల మధ్య వైద్యులు గుండెను అపోలో ఆస్పత్రికి చేర్చారు. వైద్యులు, సిబ్బంది పరుగులు పెట్టిన తీరు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది కాలంతో సమానంగా పరుగులు పెట్టిన వారి ప్రయాణం ఎంతోమందిని కదిలించింది. ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలో వరకు మెట్రో రైల్ అధికారుల సహకారం తీసుకోగా, జూబ్లీహిల్స్ చెక్​పోస్టు నుంచి ఫిలింనగర్ అపోలో వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటుకు అడుగడుగునా పోలీసులు సహకారం అందించారు.

మెట్రోలో గుండెను తరలిస్తున్న డాక్టర్లు, సిబ్బంది