— బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో చక్రం తిప్పుతున్న ఓ కానిస్టేబుల్
— ఐదుగరు ఎస్ఐ లు మారినా ఇక్కడే తిష్ట
— ఎస్ఐలు, ఏఎస్ఐలు తాను చెప్పినట్టు వినాల్సిందే
— మండలంలో మాట వినని వారిని పోలీస్ కేసులతో వేదింపులు
— పోలీస్ స్టేషన్ లో అన్ని దందాలు చక్కబెడుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ అందరికి చుక్కలు చూయిస్తున్నాడు. తాను చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం అయినా పోలీస్ స్టేషన్ లో కీలక పదవిలో ఉండడంతో ఆ స్టేషన్ కు ఆయనే బాస్ అన్నట్లుగా వ్యవహారిస్తున్నాడు.ఇక్కడ తాను చెప్పిందే వేదం అని తాను చెప్పినట్లు అందరూ వినాలని హుకుం జారీ చేస్తున్నాడు. పైగా ఈ స్టేషన్ లో ఇప్పటికే ఐదుగురు ఎస్ఐ లు మారినా తాను మాత్రం ఇక్కడే దర్జాగా తిష్ట వేసి పాతుకుపోయాడు. మండలంలో వివిధ రకాల దందాలు, ఇల్లీగల్ పనులు ఏం జరిగినా తన కనుసన్నల్లో నిర్వహిస్తుండడం విశేషం. ఎస్ఐలు, ఏఎస్ఐ లు ఇతర ఏ సిబ్బంది అయినా తాను చెప్పినట్లే నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేస్తుండడం అతని దౌర్జన్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ స్టేషన్ కు వచ్చే వారు ఆ కానిస్టేబుల్ బూతు పురాణం విని భయపడడం కామన్ గా మారిపోయింది. మండలంలో ఎవరైనా ఆయన మాట వినక పోతే పోలీస్ కేసులతో వెంటాడడం, తనకు ఇష్టమొచ్చిన సెక్షన్లు పెట్టి వేదింపులకు గురిచేస్తున్నాడు. నాగర్ కర్నూల్ జిల్లా కు సమీపంలో ఉన్న బిజినపల్లి పోలీస్ స్టేషన్ పై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో సదరు కానిస్టేబుల్ అన్ని తానై పోలీస్ స్టేషన్ ను పాలిస్తున్నాడు.
…. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: మనో హార్ , జిల్లా ఎస్పీ, నాగర్ కర్నూల్, పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుళ్లకు ఐదేళ్ల వరకు ఒకే దగ్గర పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా విధులు నిర్వహించినా ఎలాంటి అవినీతి, అక్రమాలు, ఫిర్యాదులు లేకుంటే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలక్షన్ బదిలీలు నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి లాంగ్ స్టాండింగ్ ఉన్న కానిస్టేబుళ్లను తప్పనిసరిగా బదిలీ చేస్తాం. బిజినపల్లి పీఎస్ లో లాంగ్ స్టాండింగ్ ఉన్న విషయం నా దృష్టికి రాలేదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.