Breaking News

లైంగికదాడి కేసును ఫాస్ట్రాక్​కోర్టుకు అప్పగించండి

లైంగికదాడి కేసును ఫాస్ట్రాక్ కోర్టుకు అప్పగించండి
  • ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
  • మల్లాయిపల్లి బాలిక కుటుంబానికి మందకృష్ణ పరామర్శ

సామాజిక సారథి, వనపర్తి: మల్లాయిపల్లి బాలిక లైంగిక దాడి కేసును ఫాస్ట్రాక్​కోర్టుకు అప్పగించాలని ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. సోమవారం ఆయన మల్లాయిపల్లి బాలిక కుటుంబాన్ని ఆయన పరమార్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోయాయని, ఒక వారం రోజుల్లోనే చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల, వనపర్తి జిల్లా మల్లాయిపల్లిలలో బాలికలపై లైంగిక దాడులు ఇందుకు నిదర్శనం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినప్పటికీ విచారణ నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయని, దీంతో కేసులు నీరుగారిపోయి సాక్ష్యాలు తారుమారు అవుతున్నాయన్నారు. అందుకే మల్లాయిపల్లి బాలిక లైంగిక దాడి కేసును ఫాస్ట్రాక్​కోర్టుకు

అప్పగించాలని ఆయన కోరారు. వనపర్తి జిల్లాలో కలెక్టర్ గా, ఎస్పీగా ఇద్దరూ మహిళలే ఉన్నారని వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, జిల్లాలో మరెక్కడా ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదు అనుకుంటే వారు త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. లేదంటే దళిత ప్రజానీకాన్ని, బాధితులను ఏకం చేసి ఈ నెల 24న వనపర్తిలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు కోళ్ళ శివ మాదిగ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బోరెల్లి వెంకటయ్య మాదిగ, ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు గంధం లక్ష్మయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజనగరం రాజేశ్ మాదిగ, నాయకులు మంద నరసింహ, రాజారాం ప్రకాశ్, భగత్​తదితరులు ఉన్నారు.