Breaking News

అడ్డదారిలో గురుకుల సీట్లు

అడ్డదారిలో గురుకుల సీట్లు

  • టీజీసెట్ ఎంట్రెన్స్ లో బోగస్ విద్యార్థులకే పెద్దపీట
  • అప్లికేషన్స్ నుంచి ఫలితాల దాకా అంతా నిర్లక్ష్యమే
  • టీజీ సెట్ నిర్వహణ లోపాలను పట్టించుకోని ఉన్నతాధికారులు
  • ప్రైవేట్ గురుకుల కోచింగ్ సెంటర్లకు విద్యాశాఖ సహకారం

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తెలంగాణ గురుకుల సెట్ (టీజీ సెట్) ఎంట్రెన్స్ టెస్ట్ లో అధికారులు బోగస్ కే పెద్దపీట వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సెట్ ఎంట్రెన్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల వెల్లడి వరకు అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారింది. టీజీ సెట్ ఎంట్రెన్స్ నిర్వహణ ప్రక్రియలో ఉన్న లోపాలను కొందరు గురుకుల, నవోదయ కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అధికారుల అలసత్వాన్ని నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల అమాయకత్వాన్ని కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. గురుకులాల్లో అడ్డదారుల్లో సీట్లు తెచ్చేందుకు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చేస్తున్న జిమ్మిక్కులకు విద్యాశాఖ అధికారులు సైతం తమవంతు పర్సేంటేజీలు తీసుకుని తమ వంతు సహకారం అందిస్తున్నారు. బోగస్ బోనఫైడ్ లు పెట్టిన వారికి సులువుగా గురుకుల సీట్లు వస్తుండటం విశేషం.

బోగస్ కే పెద్దపీట
టీజీ సెట్ ఎంట్రెన్స్ కోసం వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, శ్రీరంగాపూర్, ఆత్మకూర్ తదితర మండలాల్లో కొందరు బోగస్ బోనఫైడ్ లు పెడుతున్నారని అధికారులకు స్టూడెంట్ యూనియన్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అప్పటి వనపర్తి డీఈవో రవీందర్ ను ఆదేశించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఫిర్యాదులు వచ్చిన మండలాల ఎంఈవోలను మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకున్నారు. తమపై ఎలాంటి విచారణ లేకుండా ఉండేందుకు భారీ ఎత్తున నగదును ఎంఈవోల ద్వారా వనపర్తి డీఈఓ రవీందర్ కు అప్పజెప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీజీసెట్ పరీక్ష పూర్తయ్యి ఫలితాలు వచ్చినా బోగస్ బోనఫైడ్ ల అంశంపై ఇప్పటివరకు ఎలాంటి విచారణ లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.పైగా వనపర్తి జిల్లా నుంచి హైద్రాబాద్ లో చదువుతున్నట్లు బోగస్ బోనఫైడ్ లు పెట్టిన వారిలో ముగ్గురికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శేరిగూడ గర్ల్స్ స్కూలు, మరొకరి బోరబండ గర్ల్స్ స్కూలు, ఇంకొకరికి బండ్లగూడ, నాగారం బాయ్స్ స్కూలులో సీట్లు రావడం బోగస్ కు పెద్దపీట వేస్తున్నట్లు తేటతెల్లమవుతోంది.

అధికారుల నిర్లక్ష్యం
టీజీ సెట్ ఎంట్రెన్స్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సులువుగా సొమ్ము చేసుకుంటున్నారు. దరఖాస్తు ప్రక్రియ పకడ్బందీగా లేకపోవడం, ఫలితాల వెల్లడిలో పారదర్శకత లేకపోవడంతో కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నేరుగా టీజీ సెట్ ఎంట్రెన్స్ నిర్వహణ సిబ్బందితోనే లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఒక్కసారి ఐదో తరగతి లో సీటు దక్కించుకుంటే పదో తరగతి వరకు ఎలాంటి అడ్డంకులు ఉండకపోవడంతో దరఖాస్తు సమయంలోనే అధికారులు పకడ్భందీగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. టీజీ సెట్ ఎంట్రెన్స్ కోసం నోటిఫికేషన్ కు సరిపడే విధంగా స్టూడెంట్ల పుట్టిన తేదీలు మార్చడం, బోగస్ బోనఫైడ్ లు, అడ్రస్ లు పెట్టి దరఖాస్తులు చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి అధికారులకు లేకపోవడంతో ఏళ్లుగా అదే దారిని ఎంచుకుంటున్నారు. ముందు ఎంట్రెన్స్ కు తప్పుడు వివరాలతో దరఖాస్తు చేయడం ఫలితాలు వచ్చాక వాటికి తగ్గట్లు రికార్డులు మార్చి అడ్మిషన్ తీసుకోవడం చేస్తున్నారు. నాలుగో తరగతి వరకు ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా తన ఆధార్ నెంబర్ తో ఎక్కడో ఒకచోట అడ్మిషన్ తీసుకుని ఉన్నా ఎంట్రెన్స్ కోసం తప్పుడు రికార్డులు చేస్తున్నారు. అలా కాకుండా టీజీ సెట్ ఎంట్రెన్స్ దరఖాస్తు ప్రక్రియను యూడైస్ కు అనుసంధానం చేస్తే దరఖాస్తు సమయంలోనే ఆ స్టూడెంట్ ఏ స్కూలులో చదువుతున్నాడో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. కానీ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఎంట్రెన్స్ ను నిర్వహిస్తుండటంతో అడ్డదారిలో గురుకుల సీట్లు పొందుతున్న స్టూడెంట్లు రోజురోజుకు అధికమవుతున్నారు. పైగా కొందరు క్షేత్రస్థాయిలో ఎంఈఓలు, డీఈఓ లు కోచింగ్ సెంటర్ల నుంచి మామూళ్లు తీసుకుంటూ సహకరిస్తుండడం, మరికొందరు గురుకులాల ప్రిన్సిపాళ్లు వాళ్ల స్కూళ్ల పేర్ల మీద అలాట్ మెంట్ ఆర్డర్ వస్తే చాలు ఎలాంటి రికార్డులను పరిశీలించకుండా సహకరిస్తుండటంతో ఈ అవినీతి దందా ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. టీజీ ఎంట్రెన్స్ నిర్వహణపై ఎన్ని ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా రాష్ట్ర స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గురుకుల సీట్ల అవినీతి దందా దర్జాగా కొనసాగుతోంది.