- రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ల ఎగ్జామ్స్ డేట్స్ ఫిక్స్
- రోడ్డున పడనున్న 2వేల మంది అతిథి అధ్యాపకులు
- ఏళ్లుగా గవర్నమెంట్ కాలేజీల్లో సేవలు
- న్యాయం చేయాలంటూ వేడుకోలు
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల బతుకులు త్వరలోనే రోడ్డున పడనున్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజిల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను భర్తీచేసేందుకు ఇదివరకే టీఎస్ పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రావడంతో పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. బుధవారం టీఎస్ పీఎస్సీ జూనియర్ లెక్చరర్ల ఎగ్జామ్స్ డేట్స్ ను సైతం ప్రకటించడంతో గెస్ట్ లెక్చరర్ల గుండెల్లో గుబులు మొదలైంది. జూనియర్ లెక్చరర్ల నియామక ప్రక్రియ త్వరలోనే కంప్లీట్ కానుండటంతో ఇప్పటివరకు పనిచేసిన గెస్ట్ లెక్చరర్లు ఇక ఇంటి దారి పట్టాల్సి రావడం అనివార్యమైంది. రాష్ట్రవ్యాప్తంగా 404 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 2వేల మంది గెస్ట్ లెక్చరర్లు రోడ్డున పడనున్నారు.
భరోసా ఇవ్వని సర్కారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్ పద్దతిలో ఉద్యోగాల భర్తీ ఉండదని సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల స్థానంలో గత ఆంధ్రా పాలనలో మాదిరిగానే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తూనే వచ్చారు. ఇదే కోవలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో తెలంగాణ ఏర్పాటు తర్వాత 2016 నుంచి గెస్ట్ లెక్చరర్ల నియామకం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 404 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో సుమారు 2వేల మంది గెస్ట్ లెక్చరర్లుగా నియమించుకుని ఇప్పటివరకు వారిచేత ప్రభుత్వం సర్వీస్ చేయించుకుంటూనే ఉంది. పైగా గెస్ట్ లెక్చరర్లను సైతం రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల మాదిరిగానే అన్ని సమాన విద్యార్హతలతో పాటు త్రీ మెన్ కమిటీ ద్వారా నియమించుకోవడం గమనార్హం. ఎన్నో ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను నమ్ముకుని రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్లతో సమానంగా ఇంటర్ విద్యాభివృద్దికి అహర్నిశలు కృషిచేసిన గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం ఏనాడూ భరోసా కల్పించలేదు. పైగా సర్కారు తమ రాజకీయ అవసరాల కోసం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయడం, వారి స్థానాలను వదిలేసి కేవలం గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్న ఖాళీలను చూయిస్తూ రెగ్యులర్ జేఎల్స్ ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం గెస్ట్ లెక్చరర్లకు కంటి మీద కునుకు లేకుండాచేస్తోంది.
రోడ్డున పడనున్న గెస్ట్ లెక్చరర్లు
ఎన్నో ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను నమ్ముకుని అరకొర జీతాలతో అష్టకష్టాలతో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లపై సర్కారుకు కనికరం కరువైంది. రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్లతో సమానంగా విద్యార్హతలు ఉండి, వారితో సమానంగా ఏళ్లుగా విధులు నిర్వహించినా ఇప్పటివరకు కనీసం ఉద్యోగ భద్రత కాదుకదా.. కనీసం నెలనెల జీతాలు కూడా రాని పరిస్థితి నెలకొంది. గత విద్యాసంవత్సరం పనిచేసిన ఆరు నెలల జీతాలు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదంటే వీరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవారం రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండడం, రెగ్యులర్ జేఎల్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమై ఎగ్జామ్స్ డేట్స్ ఫిక్స్ కావడంతో గెస్ట్ లెక్చరర్లు గుండెలు బాదుకుంటున్నారు. చేసిన పనికి జీతాలు రాకపోవడం, రెగ్యులర్ జేఎల్స్ రిక్రూట్ అయితే తప్పనిసరిగా ఇంటిదారి పట్టాల్సి రావడంతో గెస్ట్ లెక్చరర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో వెట్టి చాకిరీ చేయించుకుని ఇప్పుడు ఉన్నట్టుండి రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీచేస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. అన్ని విద్యార్హతలు ఉండి త్రీమెన్ కమిటీ ద్వారా నియామకమైన తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.